Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీనియర్ సినీ రచయిత సెన్సార్ బోర్డ్ మెంబర్ “యడవల్లి” కన్నుమూత!!

పలు తెలుగు, కన్నడ చిత్రాలకు రచన చేసిన యడవల్లి వేంకట లక్ష్మీ నరసింహశాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) (75) అనారోగ్యంతో విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు. యడవల్లిగా చిత్రసీమలో ప్రసిద్ధులు. వీరి స్వస్థలం నెల్లూరు. తండ్రి మునిసిపాలిటీ హెల్త్ ఆఫీసర్ గా పని చేసేవారు. విజయవాడలో స్థిరపడ్డారు. అక్కడే యడవల్లి స్కూల్ ఫైనల్ చదివారు. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుంచి సాహిత్యంలో ప్రవేశం ఉంది. యుక్త వయసులోనే ‘నక్షత్రాలు’ పేరుతో వచన కవితా సంపుటిని వెలువరించారు. ఈ పుస్తకానికి ముందుమాట రాసిన వచన కవితా సారథి కుందుర్తి ఆంజనేయులు, యడవల్లి కవితలను ప్రశంసించారు. ఈ పుస్తకాన్ని తన గురువు ఆరుద్రకి యడవల్లి అంకితం ఇచ్చారు. అలానే ‘విరిగిన కొమ్మకు విరిసిన మల్లెలు’ పేరుతో నవల రాశారు.

విజయవాడలో రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా చిత్రసీమలోకి యడవల్లి అడుగు పెట్టారు. మాదిరెడ్డి సులోచన రాసిన ‘తరం మారింది’ అనే నవలను అదే పేరుతో రాధాకృష్ణమూర్తి తీసిన సినిమాకు తగిన విధంగా భాషనూ, యాసనూ సమకూర్చడానికి యడవల్లి సాయం చేశారు. అందుకోసం చెన్నై వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కలసి పని చేసే అవకాశం ఆయనకు దొరికింది. కమలాకర కామేశ్వరరావుతో కూడా పని చేశారు. విక్టరీ మధుసూదనరావుతో ఆయన సొంత సినిమా ‘ఆత్మకథ’కు వర్క్ చేశారు. యడవల్లిని నటీమణి లక్ష్మి కన్నడ సినీపరిశ్రమకు పరిచయం చేశారు. అప్పటి నుండీ తెలుగు సినిమాలతో పాటు కన్నడ చిత్రాలకు సైతం పని చేస్తూ ఉన్నారు. దాదాపు పదిహేను కన్నడ సినిమాలకు రచన చేశారు. ఓ తమిళ చిత్రానికి దర్శకత్వం వహించారు. ‘తెలుగు సినిమాల్లో హాస్యం’, ‘తెలుగు సినీ దర్శక మాలిక – విజయ వీచిక’, ‘తెలుగు చిత్రాలలో ప్రగతి కిరణాలు’ పుస్తకాలను రచించారు. పలు టీవీ సీరియల్స్ కు, కథలు – మాటలు సమకూర్చారు. శ్రీ యం.వెంకయ్య నాయుడు భారత ఉప రాష్ట్రపతిగా సేవలు అందిస్తున్న సమయంలో తన రచనలను వారికి అందించి, అభినందనలు పొందారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్ గా సేవలు అందిస్తున్నారు. అవివాహితులైన యడవల్లి డిసెంబర్ నెలాఖరులో అనారోగ్య కారణాలతో విజయవాడలోని తమ్ముడు నాగేశ్వరరావు చెంతకు చేరారు. దాదాపు యాభై రోజుల పాటు చికిత్స చేయించినా ఉపయోగం లేకపోయిందని, శనివారం రాత్రి యడవల్లి తుదిశ్వాస విడిచారని సోదరుడు తెలిపారు. ఆదివారం ఉదయం విజయవాడలో యడవల్లి అంత్యక్రియలు జరిగాయి!!

Related Posts

Latest News Updates