కాకినాడ జిల్లాలోని పెద్దాపురం మంండలంలో విషాదం జరిగింది. అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ ట్యాంకర్ లో దిగి ఏడుగురు కార్మికులు చనిపోయారు. ఫ్యాక్టరీలో వున్న ట్యాంకర్ ను శుభ్రం చేసేందుకు అందులోకి దిగి, మరణించారు. ఒకరి తర్వాత ఒకరు ట్యాంకర్ లోకి దిగి, ఊపిరాడక మరణించారు. మృతుల్లో ఐదుగురు పాడేరు వాసులే. మిగిలిన వారు పెద్దాపురం మండలం పులిమేరు గ్రామానికి చెందిన వారు. పరిశ్రమలోని ఆయిల్ ట్యాంకర్‌ను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చూస్తుంటారు. ఈ క్రమంలో రెండు రోజులుగా ట్యాంకర్‌లో ఆయిల్ మొత్తం తీసివేశారు.
దీంతో ఏడుగురు కార్మికులు అందులో దిగి ట్యాంకర్‌ను శుభ్రం చేస్తుండగా ఒక్కసారిగా ఘాటైన వాయువులు వెలువడటంతో కార్మికులకు ఊపిరి అందలేదు. వెంటనే బయటకు వచ్చేందుకు కార్మికులు ప్రయత్నించినప్పటికీ ఫలించకపోవడంతో ఊపిరాడక ఏడుగురు కార్మికులు అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.