కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం మరింత రాజుకుంది. మహారాష్ట్ర బస్సులపై కర్నాటక రక్షణ వేదిక కార్యకర్తలు రాళ్లు రువ్వారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్, సాంగ్లి, పూణె లో కర్నాటక బస్సులపై శివసేన కార్యకర్తుల దాడులు చేశారు. దీంతో మహారాష్ట్ర ప్రభుత్వం కర్నాటక ప్రాంతాలకు తమ బస్సులను నిలిపేసింది. దాడులు జరిగేందుకు అవకాశం వుందనే కర్నాటక ప్రాంతాలకు బస్సులు నిలిపేశారు. ప్రయాణికుల భద్రతపై పోలీసుల నుంచి హామీ వచ్చిన తర్వాతే.. బస్సులను పునరుద్ధరిస్తామని మహారాష్ట్ర ప్రకటించింది.
కర్నాటకలోని బెళగావిని మహారాష్ట్ర తమదే అని అంటుంటే… మహారాష్ట్రలోని షోలాపూర్ తమదేనని కర్నాటక చెబుతోంది. 1956 లో రెండు రాష్ట్రాలు ఏర్పడినప్పటి నుంచి ఈ సమస్య అలాగే కొనసాగుతోంది. అప్పటి నుంచి ఈ ప్రాంతంపై వివాదం చెలరేగుతూనే వుంది. ఇక.. మహారాష్ట్రలోని కన్నడ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో చేర్చాలని కర్నాటక డిమాండ్ చేస్తోంది.
ఒక్కసారిగా ఈ వివాదం రేగడంతో కర్నాటక సీఎం బొమ్మైతే, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ ఫోన్లో మాట్లాడారు. మహారాష్ట్ర మంత్రులు బెళగావి పర్యటనను రద్దు చేసుకోవాలని సీఎం బొమ్మై సూచించారు. ఇక… దీనిపై ఎన్సీపీ అధినేత శరద్ పవార్ స్పందించారు. ఈ ఆందోళనలకు కర్నాటక సీఎం బొమ్మై కారణమని శరద్ పవార్ ఆరోపించారు. మహారాష్ట్ర నుంచి కర్నాటకలోకి ప్రవేశించే వాహనాలపై దాడులు ఆపకుంటే మరో విధంగా స్పందించాల్సి వస్తుందని పవార్ హెచ్చరించారు.