కృష్ణా నది మిగులు జలాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మధ్య వాటాలను నిర్ధారించే అంశం కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) పరిశీలనలో ఉందని జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్ తుడు వెల్లడించారు. రాజ్యసభలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కృష్ణా బేసిన్లోని ప్రాజెక్ట్‌లలో 75 శాతం నికర జలాలకు మించి ప్రవహించే మిగులు జలాలను రెండు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసేందుకు నిర్ధుష్టమైన విధానం రూపకల్పన చేసే బాధ్యతను కేఆర్ఎంబీ రివర్ మేనేజ్‌మెంట్ కమిటీ (ఆర్‌ఎంసీ)కి అప్పగించినట్లు తెలిపారు.
వర్షాకాలంలో కృష్ణా నదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్ట్‌ల నుంచి విడుదలయ్యే మిగులు జలాలను ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు నియంత్రిత పద్ధతిలో పంపిణీ చేసేందుకు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ)కు చెందిన సాంకేతిక సంఘాన్ని తమ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిందని మంత్రి చెప్పారు. అయితే ఉభయ రాష్ట్రాలు దీనికి సంబంధించిన అవసరమైన సమాచారం సమర్పించకపోవడంతో సాంకేతిక సంఘం తనకు అప్పగించిన బాధ్యతను పూర్తి చేయలేకపోయిందని ఆయన పేర్కొన్నారు.