కాలిఫోర్నియాలోని శాన్ హోసే నగరంలో ఆదివారం జులై 31న శివపదం నృత్యరూపకం ‘‘కాశి సందర్శనం’’ కనులపండువగా జరిగింది. సామవేదం షణ్ముఖశర్మ తెలుగు, సంస్కృత భాషలలో రచించిన వెయ్యికిపైగా శివపదాలు నుంచి కాశి సందర్శనంలోని ఏకాదశ శివపదం కీర్తనలకు మల్లాది సూరిబాబు, మల్లాది శ్రీరాం, మల్లాది రవికుమార్, అనుములయోష, గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ తదితరులు సంగీతం సమకూర్చి గానం చేసారు. ప్రతి నృత్యం ముందు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ ప్రత్యక్ష వ్యాఖ్యానం చేయడం ఒక చారిత్రాత్మకమైన ఘట్టమని నిర్వాహుకులు తెలిపారు.
కాలిఫోర్నియాలో కాశి సందర్శనం – శివపదం నృత్యరూపకం కాశీలో వర్ణించే 11 సంస్కృత కీర్తనలను ఎంపిక చేసుకొని, శాన్ హోసేకి చెందిన సునీత పెండెకంటి, భిదిష మొహంత్యతో సహా 55 మంది నృత్యకళాకారులు ప్రదర్శనలిచ్చారు. చివరగా జయ జయ జయ గంగే అనే శివపద కీర్తనతో, నృత్య కారులు, షణ్ముఖ శర్మతో పాటుగా, ఈ కాశి సందర్శనం నృత్యరూపకాన్ని రూపుదిద్దిన సూత్రదారులు వాణి, రవిశంకర్ గుండ్లాపల్లి దంపతులు గంగా మాతకు దీపాలతో హారతి ఇచ్చి నిత్యం కాశీలో జరిగే గంగా హారతి దృశ్యాన్ని అద్భుతంగా కళ్ళకి కట్టినట్టు చూపించి హాల్ అంతా శివమయం చేసారు.