TSPSC పేపర్ లీకేజీ రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా మరిన్ని లీకులు బయటకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో TSPSC కార్యదర్శి అనితా రామచంద్రన్, బోర్డు మెంబర్ లింగారెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసింది. పేపర్ లీకేజీ విషయంలో శనివారం విచారణకు హాజరవ్వాలని ఆదేశించింది. అయితే.. ఇప్పటి వరకైతే చైర్మన్ జనార్దన్ రెడ్డికి మాత్రం సిట్ నోటీసులు ఇవ్వలేదు. ఇక… బోర్డు మెంర్లను కూడా విచారణ చేయాలని సిట్ నిర్ణయించింది.
అందులోని ఏడుగురు బోర్డు సభ్యుల స్టేట్ మెంట్ ను సిట్ అధికారులు రికార్డు చేయనున్నారు. ఇక… లీకేజీకి సంబంధించి ముగ్గురు నిందితులను సిట్ తన కస్టడీలోకి తీసుకుంది. నాంపల్లి కోర్టు అనుమతితో నిందితులు షమీమ్, సురేష్, రమేష్ ను 5 రోజుల పాటు ప్రశ్నించనుంది. ఇక… ముగ్గురు నిందితుల్లో ఇద్దరు బోర్డు ఉద్యోగులే కావడంతో మరింత ఆసక్తి నెలకొంది.
TSPSC పేపర్ లీకేజీపై విచారణ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈడీని కోరారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లోని ఈడీ కార్యాలయానికి వెళ్లి అధికారులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ… మంత్రి కేటీఆర్ కి వందకోట్లు ఇస్తే ఎన్ని బూతులైనా తిట్టొచ్చా అంటూ విరుచుకుపడ్డారు. తన పరువు వంద కోట్లు అని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ను అవినీతిపరులకు అడ్డాగా మార్చేశారని మండిపడ్డారు. చైర్మన్ ,మెంబర్ పై ఏదో ఒక ఆరోపణ వుందని, అనర్హులను సభ్యులుగా నియమించారని ఆరోపించారు.
ఉద్యోగాలు రాక వందలాది మంది చనిపోయినా… కల్వకుంట్ల కుటుంబానికి చీమ కుట్టినట్టైనా లేదన్నారు. ఓ వైపు పేపర్లు లీక్ అవుతుంటే… ఇతర రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ముఖ్యమంత్రి కన్నేశారని మండిపడ్డారు. మరోవైపు జూబ్లీహిల్స్ లో పార్టీలు చేసుకోవడంలో మంత్రి కేటీఆర్ బిజీ అయిపోయారన్నారు.