పేపర్ లీక్ ఎపిసోడ్ లో కీలక పరిణామం చోటుచేసుకుంది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి సిట్ అధికారులు నోటీసులు పంపారు. పేపర్ లీక్‌పై రేవంత్ చేసిన ఆరోపణలపై అధారాలు ఇవ్వాలని నోటీసులో పేర్కొంది. పేపర్ లీక్ మొత్తం మంత్రి కేటీఆర్ ఆఫీసు నుంచే వ్యవహారం సాగిందని, మంత్రికి తెలియకుండా ఇదంతా జరుగుతుందా? అని రేవంత్ ఇటీవల ప్రశ్నించారు.
ఇందులో కేటీఆర్ పాత్ర కూడా ఉందంటూ రేవంత్ ఆరోపణలకు దిగారు. లీకేజీ కేసులో ఏ2గా ఉన్న రాజశేఖర్, మంత్రి కేటీఆర్ పీఏ తిరుపతి ఇద్దరూ దోస్తులని, రాజశేఖర్‌కు ఉద్యోగం ఇప్పించింది మంత్రి పీఏనేనని, ఆయన సూచనలతోనే ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ప్రమోషన్ ఇచ్చి టీఎస్ పీఎస్సీకి బదిలీ చేశారని రేవంత్ ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఈ ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు తమకు సమర్పించాలని సిట్ అధికారులు రేవంత్ ని కోరారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారంపై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరోసారి నిప్పులు చెరిగారు. పేపర్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన ప్రభుత్వాన్ని కూడా రద్దు చేయాలంటూ వ్యాఖ్యానించారు. 2016 నుంచి ఈ ప్రక్రియ కొనసాగుతూ ప్రతిభావంతులు, పేద అభ్యర్థులు నష్టపోతున్నారని ఆరోపించారు. ఇద్దరికే సంబంధముందంటూ మంత్రి కేటీఆర్ అతి తెలివితేటలు ప్రదర్శించారంటూ విమర్శించారు. కేటీఆర్‌ను బర్తరఫ్ చేయడమే కాదు చంచల్‌గూడ్ జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసిన వారంతా ఎక్కడున్నారని ప్రశ్నించారు.