తాము ఏపీలో అధికారంలోకి వస్తే.. కచ్చితంగా రాజధాని కడతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. సీఎం జగన్, చంద్రబాబు వైఖరితో రాజధాని రైతులు తీవ్రంగా నష్టపోయారని మండిపడ్డారు. బీజేపీ ఆలోచన కేవలం అభివృద్ధి మాత్రమేనని చెప్పుకొచ్చారు. మాజీ ప్రధాని వాజ్ పాయితో వున్నట్లుగా చంద్రబాబు ప్రస్తుత ప్రధాని మోదీతో వుంటే.. రాజధాని పూర్తయ్యేదేనని అన్నారు.
ప్రధాని మోదీ ఏపీకి ఏం చేశారని చాలా మంది అడుగుతున్నారని, విజయవాడలో 5 ఫ్లై ఓవర్లు, అమరావతి నుంచి మచిలీపట్నం మధ్య నాలుగు వరుసల రహదారి, జాతీయ రహదారుల అభివృద్ధి ఇవన్నీ ప్రధాని మోదీయే చేశారని సోము వీర్రాజు పేర్కొన్నారు. ఇవన్నీ కేంద్రం చేస్తున్న పనులు కావా? అంటూ ప్రశ్నించారు. ఐదేళ్ల పాలనతో రాజధాని కోసం వేల కోట్లు ఖర్చు చేశారని, కానీ.. కొంత వరకే చేశారని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే రాజధాని నిర్మాణం చేస్తామని ప్రకటించారని, ఇప్పుడు మాటం మూడు రాజధానుల ప్రస్తావన తెచ్చారని సోము వీర్రాజు ఫైర్ అయ్యారు.