నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. నేషనల్ హెరాల్డ్ లో అక్రమ నగదు చలామణికి పాల్పడ్డారన్న అభియోగంపై తమ ముందు విచారణకు హాజరు కావాలని ఈడీ సోనియానకు సమన్లు జారీ చేసింది. అయితే.. వాస్తవానికి గత నెలలోనే సోనియా విచారణకు హాజరు కావాల్సి వుంది. కానీ కోవిడ్ కారణంగా తాను విచారణకు హాజరు కావడం లేదని సోనియా ఈడీకి తెలిపింది. ఇక… మనీ లాండరింగ్ నిరోధక చట్టంలోని క్రిమినల్ సెక్షన్ల కింద ఆమె తన వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేసుకుంటారు. పత్రికలో సోనియా, రాహుల్ షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించిన ప్రశ్నలను ఈడీ వేయనుంది.
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఇదే కేసుకు సంబంధించి పలుమార్లు ఈడీ విచారణకు హాజరయ్యారు. జూన్ 13 న తొలి సారి విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత దాదాపు 4 సిట్టింగ్స్ లో 40 గంటల పాటు ఈడీ అధికారులు రాహుల్ ను ప్రశ్నిస్తూ వచ్చారు. ఇక.. ఈడీ ముందు సోనియా గాంధీ విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేసేందుకు కాంగ్రెస్ రెడీ అయ్యింది. నేడు పార్టీ ఎంపీలు ఏఐసీసీ కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ర్యాలీగా ఈడీ కార్యాలయానికి చేరుకుంటారు.