పార్లమెంట్ లో కొన్ని పదాలను నిషేధిస్తున్నట్లు వచ్చిన వార్తలపై లోకసభ స్పీకర్ ఓం బిర్లా స్పందించారు. ఉభయ సభల్లో ఏ పదాన్ని కూడా తాము నిషేధించలేదని ఆయన ప్రకటించారు. సభా మర్యాదలకు అనుగుణంగా సభ్యులు తమ స్వేచ్ఛగా అభిప్రాయాలను ప్రకటించవచ్చని స్పీకర్ స్పష్టం చేశారు. కొన్ని పదాలను తొలగించామని, తొలగించిన పదాల సంకలనం మాత్రమే జారీ చేశామని స్పష్టత ఇచ్చారు. ఏ పదం నిషేధించబడలేదు, 1954 నుండి కొనసాగుతున్న పద్దతి ప్రకారమే.. పార్లమెంటు కార్యకలాపాల సమయంలో తొలగించాం అని స్పీకర్ పేర్కొన్నారు.
పేపర్లు వృథా కాకుండా ఉండేందుకు ఇంటర్నెట్‌లో పెట్టాం. పదాలు నిషేధించబడలేదని తెలిపారు. తొలగించబడిన పదాల సంకలనాన్ని తాము జారీ చేశామని, ప్రతిపక్షాలు ఈ 1,100 పేజీల నిఘంటువును చదివారా? అంటూ స్పీకర్ ప్రశ్నించారు. చదివి వుంటే అపోహలు వ్యాప్తిలోకి రావన్నారు. ఇలా పదాల సంకలనంతో కూడిన నిఘంటువు 1954, 1992,1999, 2004,09,2010 లోనూ విడుదల చేశారని గుర్తు చేశారు. నిషేధిత పదాలంటూ తప్పుదోవ పట్టిస్తున్నారి ఓం బిర్లా మండిపడ్డారు.