లోక్ సభలో నలుగురు కాంగ్రెస్ ఎంపీలను సస్పెండ్ చేస్తూ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. మాణిక్కం ఠాగూర్, టీఎన్ ప్రతాపన్, జ్యోతిమణి, రమ్య హరిదాస్ పై ఈ వేటు వేశారు. వర్షాకాల సమావేశాలు ముగిసేంత వరకూ ఈ సస్పెన్షన్ కొనసాగుతుందని స్పీకర్ ప్రకటించారు. సభలో అనుచితంగా ప్రవర్తిస్తున్నారని, సభా కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తూనే వున్నారని స్పీకర్ పేర్కొన్నారు. విపక్షం కోరుకున్న అంశంపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా…. విపక్ష సభ్యులు నిరసన తెలుపుతూనే వున్నారని స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక… గ్యాస్ సిలిండర్ ధర పెంపు, మైదా, మజ్జిగ, పెరుగు వంటి పాల ఉత్పత్తులపై కేంద్రం జీఎస్టీ విధించడంపై కాంగ్రెస్ తీవ్ర ఆందోళన చేసింది. ఈ అంశాలపై చర్చ జరగాలని డిమాండ్ చేస్తూ సభలో వాయిదా తీర్మానం ఇచ్చింది. మరోవైపు ధరల పెరుగుదలపై లోకసభలో కాంగ్రెస్ ఎంపీలు ప్లకార్డులతో నిరసనలు తెలియజేశారు. నిరసన తెలియజేయాలంటే సభ బయట ప్లకార్డులు ప్రదర్శించాలని, సభలో కుదరదని స్పీకర్ ఓం బిర్లా స్పష్టం చేశారు. ఇక… సస్సెన్షన్ కు గురైన ఎంపీలు కేంద్రంపై మండిపడ్డారు. పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం దగ్గరకు వెళ్లి, నిరసనలు చేశారు. తమను సస్పెండ్ చేయడం ద్వారా కేంద్రం బెదిరింపులకు దిగుతోందన్నారు. ప్రజలకు సంబంధించిన అంశాలను పార్లమెంట్ లో ప్రశ్నిస్తే.. తమ గొంతు నొక్కుతున్నారని ఎంపీలు మండిపడ్డారు.