జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానంలో స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ పూజల తర్వాత ఆయన.. తన ఎన్నికల ప్రచార రథం వారాహికి అర్చకులతో కలసి ప్రత్యేకంగా పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో ఇవి వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్ నుంచి ఉదయం 8 గంటల ప్రాంతంలో రోడ్డు మార్గం ద్వారా జనసేన పవన్ కల్యాణ్ కొండగట్టు అంజన్న దేవస్థానానికి బయల్దేరారు. కొండగట్టుకు చేరుకున్న జనసేనానికి అభిమానులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు.
వారాహికి పూజలు చేస్తున్న సమయంలో చుట్టుపక్కల ప్రజలు, స్థానికులు పవన్ కి చూసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ కార్యక్రమం పూర్తైన తర్వాత పవన్ కల్యాణ్ నాచుపల్లి సమీపంలోని ఓ రిసార్టులో తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించారు. ఎన్నికల్లో పోటీకి దిగుతామని ఈ సందర్భంగా పవన్ కార్యకర్తలకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, కార్యకర్తల స్థితిగతులను పవన్ అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశం అయిన తర్వాత పవన్ కల్యాణ్ ధర్మపురి లక్ష్మీ నారసింహ స్వామి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడి నుంచే అనుష్టుప్ నారసింహ యాత్రకు శ్రీకారం చుడతారు. ఇందులో భాగంగా 31 నారసింహ క్షేత్రాలను పవన్ దశల వారీగా దర్శించుకోనున్నారు.
కొండగట్టులోనే ఎందుకంటే…
మెగాస్టార్ సారథ్యంలోని ప్రజారాజ్యం సమయంలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కల్యాన్ పనిచేశారు. అప్పట్లో కొండగట్టు పర్యటనకు పవన్ వచ్చారు. అప్పుడే పెను ప్రమాదం తప్పింది. పవన్ కల్యాణ్ తన వాహనంపై నిల్చుని ప్రసంగిస్తుండగా.. కరెంట్ తీగలు తగిలాయి. పక్కనున్న వారు తీవ్రంగా గాయపడ్డారు. పవన్ కల్యాణ్ కి కూడా ఇబ్బందులు ఏర్పడ్డాయి. అయితే ఆంజనేయ స్వామి దయతోనే ప్రాణాపాయం నుంచి బయటపడ్డానని పవన్ చాలా సార్లు చెప్పారు. అందుకే… సెంటిమెంట్ గా కొండగట్టును ఎంచుకున్నారు.