మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు మునుగోడు వైపు ద్రుష్టి సారించాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యేగా వున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి, కాంగ్రెస్ కు రాజీనామా చేయడంతో అక్కడ ఉప ఎన్నిక ఖాయమైపోయింది. దీంతో టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అన్ని పార్టీలూ ఛాలెంజ్ గా తీసుకున్నారు. ఇప్పటికే పలు పార్టీలు మునుగోడును సెమీ ఫైనల్ గా అభివర్ణిస్తున్నాయి. బీజేపీని ఎలాగైనా ఓడించాలని అటు టీఆర్ఎస్, కాంగ్రెస్ పంథం పట్టాయి. బీజేపీ కూడా ఈ మునుగోడును అత్యంత ఛాలెంజ్ గానే తీసుకుంది. ఇక…. మునుగోడు తమ సిట్టింగ్ సీట్ కావడంతో కాంగ్రెస్ మరింత ద్రుష్టి పెట్టింది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పరిస్థితి చిందరవందరగా వుంది. కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరూ పీసీసీ చీఫ్ రేవంత్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. దీంతో అధిష్ఠానం తల పట్టుకు కూర్చుంది. ఈ గ్యాప్ ను సవరించడానికి కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జీ మాణిక్యం ఠాగూర్ నేడు హైదరాబాద్ కు వచ్చారు. రెండు రోజుల పాటు ఆయన తెలంగాణలోనే వుంటున్నారని పార్టీ ప్రకటించింది.
గాంధీభవన్ లో మునుగోడు నియోజకవర్గ వ్యూహరచన కమిటీతో సమావేశమయ్యారు. భేటీకి AICC కార్యదర్శలు హాజరయ్యారు. మునుగోడులో ఇతర పార్టీల బలాబలాలు, కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నారు. ఉప ఎన్నిక వ్యూహంపైనా పార్టీ నేతలతో డిస్కస్ చేస్తున్నారు. మునుగోడు బై పోల్ తోపాటు పార్టీ అంతర్గత విషయాలపై డిస్కస్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అలాగే మునుగోడు నియోజకవర్గంలోని 7 మండలాల ఇంఛార్జీలతో చర్చిస్తున్నారు. సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షులతో ఆజాది కా గౌరవ్ సమీక్షలో పాల్గొంటారు. గురువారం కాంగ్రెస్ ముఖ్య నాయకులతో మరోసారి సమావేశమౌతారు. దీంతో రెండు రోజుల పర్యటన పూర్తవుతుంది.