తెలంగాణపై బీజేపీ మరింత ప్రత్యేక దృష్టిసారించింది. ఇందులో భాగంగా తెలంగాణలో మరింత కీలక మార్పు చేపట్టింది. ఇప్పటి వరకూ తెలంగాణ వ్యవహారాలు చేసే తరుణ్ ఛుగ్ ను ఆ పదవి నుంచి తప్పించింది. యూపీ ఎన్నికల్లో బీజేపీని విజయ తీరాలకు చేర్చిన పథికుడు, ఓట్ల మాంత్రికుడు అయిన సునిల్ బన్సల్ ను తెలంగాణ ఇన్ ఛార్జీగా నియమించింది. ఈ ఉత్తర్వులు తక్షణమే అమలులోకి వస్తాయని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఓ ప్రకటన విడుదల చేశారు. తెలంగాణతో పాటు బన్సల్ కు అత్యంత కీలకమైన బెంగాల్, ఒడిశా రాష్ట్రాలను కూడా కట్టబెట్టారు.
బీజేపీ ప్రధాన వ్యూహకర్తల్లో సునీల్ బన్సల్ ఒకరు. యూపీలో బీజేపీ పాగా వేయడంలో బన్సల్ ది చాలా కీలక పాత్ర. బి.ఎల్. సంతోశ్, భూపేందర్ యాదవ్, సునీల్ బన్సల్ వీరందరూ ప్రధాన వ్యూహకర్తలే. సునీల్ బన్సల్ కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు అత్యంత సన్నిహితుడు. ప్రస్తుతం యూపీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నారు. తాజాగా… ఆయనకు జాతీయ ప్రధాన కార్యదర్శి హోదా కూడా దక్కింది.