ఎండో మెంట్ నుంచి ఏపీలో పాస్టర్లకు జీతాలిస్తున్నారని ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంఛార్జీ సునీల్ దేవధర్ మండిపడ్డారు. ఇదేం విధానం? అంటూ జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఎండోమెంట్ నుంచి పాస్టర్లకు జీతాలు చెల్లిస్తూ… హిందూ మతాన్ని జగన్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని తీవ్రంగా మండిపడ్డారు. హిందువుల డబ్బులతో పాస్టర్లను పోషిస్తున్నారన్నారు. ఏపీలో మార్చి 10 నుంచి మార్చి 30 వరకూ యాత్ర కొనసాగుతుందన్నారు. వైసీపీ, టీడీపీ విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, వైసీపీ ప్రభుత్వం ల్యాండ్ మాఫియా ప్రభుత్వంగా మారిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో పరిశ్రమలన్నీ వెనక్కి మరిలిపోతున్నాయని, అయినా… జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. వైసీపీ, టీడీపీ రెండూ కుల, కుటుంబ పార్టీలేనని, అవినీతి పార్టీలుగా ఎప్పుడో మారిపోయాయని ఎద్దేవా చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ బీజేపీతోనే వున్నారని, ఒకవేళ చంద్రబాబుతో కలిసినా.. ఒరిగేదేమీ వుండదని స్పష్టం చేశారు.
ఏపీలో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. బాబు వస్తే జాబు వస్తుందని తెగ ప్రచారం చేశారని, తన కొడుకు లోకేశ్ కి మాత్రమే జాబ్ దక్కిందని సునీల్ దేవధర్ అన్నారు. చంద్రబాబు సభల్లో జనాలు చనిపోతున్నా… టీడీపీ ఏమాత్రం లెక్కచేయడం లేదని, వారిని పట్టించుకోవడం లేదన్నారు. రాష్ట్రంలోని అన్ని వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు. కొన్ని రోజుల క్రితం భీమవరం కేంద్రంగా జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాల్లోనూ బీజేపీ నేతలు ఇవే కామెంట్స్ చేశారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాల హుండీ ఆదాయాన్ని ఇతర మతాలకు పంచి పెడుతున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్న రెండు కుటుంబ పార్టీలను ఓడించడానికి బీజేపీ కృషి చేస్తుందన్నారు. రాష్ట్రంలో జనసేన పార్టీలో తాము పొత్తులోనే ఉన్నామని వెల్లడించారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్ని విధాలుగా విఫలమైందన్నారు. జగన్ పాలన చూస్తుంటే చంద్రబాబు పాలన నుంచి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ప్రజల పరిస్థితి మారిందన్నారు. ఇక, పోరు యాత్ర-2 పేరుతో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో రెండు కిలో మీటర్ల మేర పాదయాత్ర చేయబోతున్నట్లు సునీల్ దియోధర్ ప్రకటించారు.