సీఎం ఉద్ధవ్ సారథ్యంలోని శివసేనకు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. రెబెల్ ఎమ్మెల్యేలకు ఊరటనిచ్చింది. ఏక్ నాథ్ షిండేతో సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ ఇచ్చిన అనర్హత వేటు పిటిషన్లపై జూలై 11 వరకూ ఎలాంటి చర్యలూ చేపట్టవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. రెబెల్స్ కు సారథ్యం వహిస్తున్న రెబెల్స్ అనర్హత నోటీసులపై సుప్రీంను ఆశ్రయించారు. పిటిషన్ దాఖలు చేశారు. అనర్హత నోటీసులపై ముంబై హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని షిండే తరపు న్యాయవాదిని సుప్రీం సూటిగానే ప్రశ్నించింది.
రాష్ట్రంలో పరిస్థితులు సరిగ్గా లేకనే, అత్యవసరమై సుప్రీంను ఆశ్రయించాల్సి వచ్చిందని ఆయన బదులిచ్చారు. రెబెల్స్ ను ఉద్ధవ్ బెదిరిస్తున్నారని రెబెల్స్ తరపు న్యాయవాది సుప్రీంకు నివేదించారు. రెబెల్స్ తరపున నీరజ్ కిషన్ కౌల్ వాదనలు వినిపించగా, సీఎం ఉద్ధవ్ వర్గం తరపున అడ్వకేట్, కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. ఇక.. ఈ కేసులో మహారాష్ట్ర సర్కార్ కు, డిప్యూటీ స్పీకర్ కు, అసెంబ్లీ కార్యదర్శికి సుప్రీం నోటీసులు జారీ చేసింది. ఐదు రోజుల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది.