బీబీసీ డాక్యుమెంటరీ వివాదం పై కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీని అడ్డుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు విచారణ జరిపింది. మూడు వారాల్లోగా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్రానికి ఆదేశాలిచ్చింది. కేంద్ర తీసుకున్న నిర్ణయానికి సంబంధించిన ఒరిజనల్ డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని ధర్మాసనం స్పష్టం చేసింది. కేసు తదుపరి విచారణను ఏప్రిల్ లో విచారిస్తామని చెప్పింది.
‘ఇండియా: ది మోడీ క్వశ్చన్’ అనే పేరుతో 2002 గుజరాత్ అల్లర్లపై బీబీసీ ఇటీవల రూపొందించిన డాక్యుమెంటరీ వివాదం సృష్టించింది. కేంద్రం ఈ డాక్యుమెంటరీని, ఇందుకు సంబంధించిన లింకులను భారత్‌లో బ్లాక్ చేసింది. ఈ డాక్యుమెంటరీ తప్పుదారి పట్టంచే విధంగాను, కుట్రపూరితంగానూ ఉందని, రాజ్యంగవిరుద్ధమని కేంద్రం పేర్కొంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి.