టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. అయ్యన్న పాత్రుడిపై నమోదైన ఓ ఫోర్జరీ కేసుకు సంబంధించిన దర్యాప్తుకే సుప్రీం కోర్టు అనుమతిని మంజూరు చేసింది. జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవి కుమార్ ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఐపీసీ 467 కింద దర్యాప్తు చేయవచ్చని సుప్రీం తేల్చి చెప్పింది. మరోవైపు ఈ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం కొట్టేసింది. కేసు దర్యాప్తు సమయంలో హైకోర్ట్ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడంపై సుప్రీం అసంతృప్తి వ్యక్తం చేసింది.
ఇరిగేషన్ కి సంబంధించిన స్థలాన్ని అయ్యన్న, ఆయన కుమారుడు రాజేశ్ ఆక్రమించి, తప్పుడు పత్రాలు తయారు చేశారంటూ గతంలో ఫోర్జరీ కేసు నమోదైంది. అయ్యన్న మంత్రిగా వున్న సమయంలో అధికారాన్ని అడ్డుపెట్టి, రాచపల్లి రిజర్వాయర్ పంట కాలువపై 2 సెట్ల మేర స్థలంలో అక్రమంగా ప్రహారి నిర్మించారన్నది ఆరోపణ. నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు ఇంటికి ఆనుకొని ఓ పంట కాలువ వుంది. నిర్మాణ సమయంలో బిల్డింగ్ అనుమతి కోసం ఇచ్చిన దరఖాస్తులో కూడా తాము నిర్మించబోయే ఇంటికి దక్షిణం, పశ్చిమాన పంట కాలువ వుందని పేర్కొనగా… ఏకంగా పంట కాలువను ఆక్రమించి ఇంటి నిర్మాణాన్ని చేపట్టినట్లు ఆరోపణలున్నాయి.