తెలంగాణలో స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు సోమవారం నుంచి ప్రారంభమయ్యాయి. నగరంలోని హెచ్ఐసీసీలో తెలంగాణ సీఎం కె. చంద్రశేఖర రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి, వజ్రోత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ… అనేక పోరాటాలు, త్యాగాలతో మనకు స్వాతంత్య్రం సిద్ధించిందని, ఏ దేశానికైనా స్వాతంత్ర్యం, అపురూప సందర్భమని వివరించారు. స్వాతంత్ర్య స్ఫూర్తి అందరికీ తెలిసేలా… వాడవాడలా… గ్రామగ్రామాన ఘనంగా స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు.
అనేక త్యాగాలతో, అనేక పోరాటాలతో స్వాతంత్య్రాన్ని సముపార్జించి 75 సంవత్సరాలు స్వయంపాలనలో అప్రతిహాతంగా ముందుకుసాగుతున్నామని, 75 సంవత్సరాలు రేపు రాబోయే 15వ తేదీకి పూర్తి చేసుకుంటామని అన్నారు. సుదీర్ఘకాలం స్వయంపాలనలో సుసంపన్నమైన భారతదేశంలో తరాలు మారుతున్నాయ్. కొత్త తరాలు వస్తున్నాయని సీఎం వివరించారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో జరిగిన సమరం, త్యాగాలు కొత్త తరానికి తెలియవని, ఎప్పటికప్పుడు సందర్భోచితంగా కొత్త తరం వారికి తెలియజేయడం పాతతరం వారి కర్తవ్యం, విధి అని సీఎం కేసీఆర్ ఉద్బోధించారు.
స్వాతంత్ర్యం కోసం అనేక మంది పెద్దలు, అనేక రకాల పద్ధతుల్లో వలస పాలకులకు వ్యతిరేకంగా అపురూపమైన త్యాగాలు చేస్తూ పోరాటాలు చేశారని, ఏ దేశానికి స్వేచ్ఛ, స్వాతంత్య్రం ఒక అపురూపమైన సందర్భమని అన్నారు. గాంధీ స్ఫూర్తితోనే అమెరికా అధ్యక్ష పదవి చేపట్టానని బరాక్ ఒబామా చెబుతుండేవాడని గుర్తు చేశారు. గాంధీజీ ఎన్నో త్యాగాలు చేసి, స్వతంత్ర పోరాటానికి నాయకత్వం వహించారని, ఆసేతు హిమాచలం పోరాటం చేశారని కొనియాడారు. భారతదేశ స్వతంత్ర సముపార్జన సారథే కాదు.. యావత్ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతిదూత అని, విశ్వమానవుడు మన మహాత్మాగాంధీ అని అభివర్ణించారు.