తెలంగాణ సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన టీ హబ్ ప్రారంభోత్సవానికి రంగం సిద్ధమైంది. ఒకేసారి 4 వేలకు పైగా స్టార్టప్ లకు వసతి కల్పించేందుకు నిర్మించిన అతిపెద్ద ఆవిష్కరణ ప్రాంగణం టీహబ్. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జి సిటీలో 400 కోట్ల రూపాయలతో తెలంగాణ సర్కార్ దీనిని నిర్మించింది. ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు దీనిని ప్రారంభించనున్నారు.53.65 మీటర్ల ఎత్తులో, మూడు ఎకరాల్లో దీనిని నిర్మించారు.
ఈ ఫెసిలిటీ సెంటర్ హైదరాబాద్ ఇన్నోవేషన్ ఎకో సిస్టంకు ఎంతో ఊతమిస్తుందని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదిగా రాష్ట్ర, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ను ప్రశంసిస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణం టీహబ్ ను రూపొందించడం సాహసమని కొనియాడుతున్నారు.
ఇక ఈ కార్యక్రమానికి స్టార్టప్ లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు 50 మందిని ప్రభుత్వం ఆహ్వానించింది. 30 మంది హాజరవుతున్నారు. దేశ, విదేశాలకు చెందిన ఐటీ రంగ నిపుణులతో పాటు సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రతినిధులు వర్చువల్ గా పాల్గొంటాయని తెలంగాణ ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ జయేశ్ రంజన్ ప్రకటించారు.
మొదటి అంతస్తు కేపటలిస్టుల కోసమే..
టీహబ్ కార్యకలాపాలను కేవలం హైదరాబాద్ నగరానికే పరిమితం చేయకుండా.. రాష్ట్రంలోనే మరో ఐదు చోట్ల రీజినల్ సెంటర్లను కూడా ఏర్పాటు చేస్తామని జయేశ్ రంజన్ ప్రకటించారు. టీహబ్ కొత్త భవనంలో మొదటి అంతస్తును పూర్తిగా వెంచర్ క్యాపిటలిస్టులకే కేటాయించామని ఆయన వివరించారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వారంతా ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లో వున్నారని చెప్పారు. వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసు కార్యకలాపాలకు అవసరమైన స్థలాన్ని టీహబ్ లో ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని జయేశ్ రంజన్ అన్నారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్ నగర్ ప్రాంతాల్లో టీహబ్ రీజినల్ సెంటర్ల ఏర్పాటు వుంటుందన్నారు.
ఒక్క రోజే 32 వేర్వేరు కార్యక్రమాలు
టీహబ్ ప్రారంభోత్సవం రోజునే 32 వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించేలా నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. మెటావర్స్, వెబ్ 3.0,ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆపర్చునిటీ హైదరాబాద్, బిల్డింగ్ ఏ యూనికార్న్, టీహబ్ టాక్స్, ఫైర్ సైడ్‌చాట్, ప్యానల్ డిస్కషన్స్, మెడ్‌టెక్, బిల్డింగ్ ఫర్ నెక్స్ బిలియన్, ఓపెన్ ఇన్నోవేషన్, బిల్డింగ్ ఫండ్ ఫర్ ఎర్లీస్టేజ్ డీప్‌టెక్ స్టార్టప్స్, మొబిలిటీ-ద ప్యూచర్, మాస్టర్ క్లాసెస్.. ఇలా మొత్తం 32 అంశాలపై ఐటీ రంగం, స్టార్టప్ రంగానికి చెందిన నిపుణులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు.