రాజస్థాన్ లోని ఉదయ్ పుర్ నగరంలో సంచలన హత్య జరిగింది. ఇస్లాం మతాన్ని అవమానించాడంటూ దర్జీ షాపు యజమాని కన్హయ్య లాల్ ను కత్తులతో నరికి చంపారు. ఈ ఘటన పట్టపగలే జరగడం విషాదం. నరికి చంపడమే కాకుండా ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. మధ్యాహ్నం సమయంలో కన్హయ్య లాల్ అనే దర్జీ షాపుకి ఇద్దరు వచ్చారు.
కస్టమర్ల రూపంలో షాపులోకి వచ్చి, దుస్తుల కొలతలు తీసుకుంటుండగా కత్తులు బయటకు తీశారు. ఒకరు మొబైల్ లో కొలతలు తీసుకుంటుండగా.. మరో వ్యక్తి కన్హయ్య లాల్ పై కత్తితో దాడి చేశాడు. మెడపై వేటు వేయడంతో తల శరీరం నుంచి వేరైపోయింది. తమ ఇస్లాంకు అవమానం జరిగిందని, అందుకే ఈ హత్య చేస్తున్నామని ప్రకటించారు.
దర్జీ కన్హయ్య లాల్ బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మకు మద్దతుగా సామాజిక మాధ్యమాల్లో ఓ పోస్ట్ పెట్టాడు. దీంతో ఓ వర్గానికి, కన్హయ్యకు వాడి వేడి చర్చ జరిగింది. బెదిరింపులు కూడా వచ్చాయి. కొన్ని రోజులు కనిపించకుండా పోయాడు. ఆ తర్వాత ఎప్పటి లాగే తన దర్జీ వ్యాపారాన్ని ప్రారంభించాడు. అంతే.. ఓ పథకం ప్రకారం దుండగులు వచ్చి, నరికి చంపారు. ఈ నిందితులను రియాజ్ అక్తర్, గౌస్ మహ్మద్ గా పోలీసులు గుర్తించారు. ఈ ఇద్దర్నీ పోలీసులు గంటలోపే అరెస్ట్ చేశారు.
ప్రధాని మోదీకే హెచ్చరికలు
ఇక.. ఈ హత్య చేసిన దుండగులు సోషల్ మీడియా వేదికగా నేరుగా ప్రధాని మోదీకే హెచ్చరికలు పంపడం కలకలం రేగింది. హత్యకు వాడిన కత్తిని చూపిస్తూ.. ఇది మోదీ మెడ దాకా కూడా చేరుతుంది అంటూ బెదిరింపులకు దిగారు. ఈ ఘటనతో రాజస్థాన్ పోలీసులు అలర్ట్ అయ్యారు. గంట వ్యవధిలోనే నిందితులను అరెస్ట్ చేశారు. ఈ ఘటనకు చెందిన వీడియోలను ఎవ్వరూ వైరల్ చేయవద్దని, శాంతిభద్రతలకు ఇబ్బందులు వస్తాయని సీఎం గెహ్లోత్ తో సహా, పోలీసులు పదే పదే విజ్ఞప్తి చేస్తున్నారు.