చెన్నై: తమిళనాడులో ఉన్న భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాలు తమ మాతృభాషలో చదువుకునేందుకు అవకాశం కల్పించాలని లింగ్విస్టిక్ మైనారిటీస్ ఫోరం ఆఫ్ తమిళనాడు (లింఫోట్) ఒక పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది.
డాక్టర్ సి.ఎం.కె. రెడ్డి నాయకత్వంలోని తెలుగు, కన్నడ, మలయాళ, ఉర్జూ తదితర మైనారిటీ భాషల ప్రతినిధులతో కూడిన ఈ సంఘం సుప్రీంకోర్టులో ఈ మేరకు ఒక స్పెషల్ లీవ్ పిటిషన్ వేసింది. ఈ విషయంలో మైనారిటీ భాషలవారికి శాశ్వత ఉపశమనం కల్పించాలని అది విజ్ఞప్తి చేసింది. ఈ సంఘం తమిళనాడులో మైనారిటీ భాషలకు సముచిత స్థానం కోసం చాలా కాలం నుంచి పోరాటం సాగిస్తోంది.
సుమారు 16 ఏళ్ల క్రితం అంటే 2006 ప్రాంతంలో తమిళనాడు ప్రభుత్వం “నిర్బంధ తమిళ చట్టాన్ని ప్రవేశపెట్టడంతో మైనారిటీ భాషలు ఇక్కడ తమ ఉనికిని కోల్పోవడం (ప్రారంభించాయి. మైనారిటీ భాషలకు సంబంధించిన విద్యార్థులు తమ మాతృభాషలో చదువుకోవడానికి అవకాశం లేకుండా పోతోండి.
దీనిపై మైనారిటీ భాషల విద్యార్దులు ఎప్పటికప్పుడు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయిస్తుండడం, తాత్కాలిక ఉపశమనం పొందడం జరుగుతోంది. మైనారిటీ భాషల విద్యార్థులకు ఉపశమనం కల్పిస్తూ గత ఏడాది హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులు గత ఏడాదితోనే ముగిశాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ సి.ఎం.క. రెడ్డి లింఫోట్ తరపున సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది.
గతంలో హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను పొడిగించేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని ఆయన అభ్యర్థించారు. అదే సమయంలో మైనారిటీ భాషల విద్యార్థులకు శాశ్వత ఉపశమనం కల్పించే లా కూడా ఆదేశాలు జారీ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. తద్వారా భాషాపరమైన మైనారిటీల రాజ్యాంగపరమైన హక్కుల్ని పరిరక్షించాలని ఆయన కోరారు.
తమిళ భాష నేర్చుకునేందుకు, తమిళంలో చదువుకునేందుకు తమకేమీ అభ్యంతరం లేదని, అయితే, తమిళంతో పాటు తమ మాతృభాషలో కూడా చదువుకునేందుకు అవకాశం కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ మీద త్వరలో విచారణ జరగబోతోంది.