సినీ దర్శకుడు, నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ RRR సినిమాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో, బయటా రచ్చ రచ్చ చేస్తున్నాయి. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు, నటుడు నాగబాబు ఇప్పటికే ఘాటుగా స్పందించారు. అయితే… దీనిపై తమ్మారెడ్డి భరద్వాజ కూడా అంతే స్థాయిలో స్పందించారు. విద్యార్థులతో జరిగిన సెమినార్ లో తాను మాట్లాడిన దానిని అర్థం చేసుకోకుండా చాలా మంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడారని మండిపడ్డారు. తానూ ఆ స్థాయిలో స్పందించగలను కానీ… తన తల్లిదండ్రులు సంస్కారంతో పెంచారన్నారు. వారం కిందటే రాజమౌళిని పొగుడుతూ ట్వీట్ చేస్తే ఎవ్వరూ మాట్లాడలేదని, ఇప్పుడు మాత్రం వివాదాస్పదం చేశారని మండిపడ్డారు.
విద్యార్థులతో సినిమాల గురించి మాట్లాడుతున్న సమయంలో RRR ప్రస్తావన వచ్చిందన్నారు. అవార్డు వస్తుందా? అని తనను అడిగారన్నారు. ఈ సందర్భంగా తాను మాట్లాడుతూ… RRR కి అంత డబ్బు ఖర్చయి వుంటుంది… ఇప్పుడు ఆస్కార్ కోసం ప్రయత్నిస్తున్నారని, ఆ డబ్బుతో ఎక్కువ సినిమాలు తీయవచ్చని మాత్రమే చెప్పానన్నారు. రెండున్నర గంటల పాటు సినిమాల గురించి మాట్లాడితే… అది వదిలేసి… నిమిషం వున్న క్లిప్ ను తీసుకొని, ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
అయితే… తమ్మారెడ్డి చేసిన వ్యాఖ్యలపై దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రపంచ వేదికపై మన సినిమా సత్తా చాటుతున్నందుకు గర్వపడాలన్నారు. సరైన సమాచారం లేకుండా ఖర్చుల గురించి ఎలా కామెంట్స్ చేస్తారని ప్రశ్నించారు. తెలుగు సినిమా, సాహిత్యం, దర్శకుడు, నటీనటులకు మొదటి సారి ప్రపంచ వేదికలపై వస్తున్న పేరు ప్రఖ్యాతులు చూసి గర్వపడాలి. అంతేకానీ… 80 కోట్లు ఖర్చు అంటూ చెప్పడానికి మీ దగ్గర అకౌంట్స్ ఏమైనా వున్నాయా? జేమ్స్ కామెరూన్, స్పీల్ బర్గ్ వంటి దర్శకులు డబ్బులు తీసుకొని మన సినిమా గొప్పతనాన్ని పొగుడుతున్నారన్నది మీ ఉద్దేశమా? అంటూ ట్వీట్ చేశారు.