ఏపీలో అధికార వైసీపీకి మళ్లీ ఝలక్ తగిలింది. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు. మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు స్థానాలను కోల్పోయిన అధికార వైసీపీకి ఇప్పుడు ఈ పరిణామం మరో షరాఘాతం. టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధకి 23 ఓట్లు వచ్చాయి. దీంతో ఆమె విక్టరీ కొట్టేశారు.
అయితే.. ఎమ్మెల్యే కోటాలోని 7 స్థానాలకు జరిగిని ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఏడుగురు అభ్యర్థులను బరిలోకి దింపింది. ఏడు స్థానాలనూ తామే కైవసం చేసుకుంటామని కూడా ప్రకటించింది. అయితే… తమ ఒక్క అభ్యర్థి పంచుమర్తి అనూరాధను తాము కచ్చితంగా గెలిపించుకుంటామని ఇటు టీడీపీ కూడా ప్రకటించింది. దీంతో పోరులో ఉత్కంఠత నెలకొంది. చివరికి టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనూరాధ విజయం సాధించారు.
ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన 7 ఎమ్మెల్సీ స్థానాలకు ఏపీలో పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 9 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ మొదటి అంతస్థులో ఎన్నికల పోలింగ్ సెంటర్ ను ఏర్పాటు చేశారు. ముందుగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తమ ఓటు హక్కును వినియోగించుకోవడంతో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఆ తర్వాత మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుమారుడి వివాహం కారణంగా అప్పలనాయుడు ఆలస్యంగా వచ్చి ఓటు వేశారు. వివాహం అనంతరం ప్రత్యేక విమానంలో విశాఖ నుంచి విజయవాడకు వచ్చి వైసీపీ ఎమ్మెల్యే ఓటు హక్కు వినియోగించుకున్నారు.