శాసనసభలోనే టీడీపీ ఎమ్మెల్యేలపై జరిగిన దాడిని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఖండించారు. శాసనసభలోనే ఓ ఎమ్మెల్యేపై దాడులు జరగడం రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడూ లేదన్నారు. ఏపీ అసెంబ్లీ చరిత్రలో ఇవ్వాళ చీకటి రోజు అంటూ విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి జగన్ ప్రోద్బలంతోనే తమ పార్టీ ఎమ్మెల్యేలు డోల బాల వీరాంజనేయ స్వామిపై దాడికి దిగారని ఆరోపించారు. సభలో జరిగిన ఘటనతో ముఖ్యమంత్రి జగన్ చరిత్ర హీనుడుగా మిగిలిపోతారన్నారు. చట్టసభలకు మచ్చ తెచ్చిన సిఎంగా నిలిచిపోతారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో సీఎం జగన్‌కు పిచ్చెక్కి ఇలా వ్యవహరించారని, ఇది శాసన సభ కాదు…కౌరవ సభ అని చంద్రబాబు మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ ఎమ్మెల్యేలు, వైసీపీ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు సభలోనే కొట్టుకోవడంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. జీవో నెంబర్ 1 ని రద్దు చేయాలంటూ టీడీపీ వాయిదా తీర్మానం ఇచ్చింది. సభ ప్రారంభమైన వెంటనే వాయిదా తీర్మానంపై టీడీపీ చర్చకు పట్టుబట్టింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ సభ్యులు స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. సభలోనే బైఠాయించి ఆందోళన చేశారు. ఈ సమయంలోనే టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పోడియాన్ని టీడీపీ సభ్యులు చుట్టుముట్టడాన్ని వైసీపీ సభ్యులు నిరసించారు. ఈ సమయంలోనే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ ఎమ్మెల్యేలు డోలా బాల వీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ ఎమ్మెల్యేలు దాడి చేసినట్లు పేర్కొంటున్నారు.
ఈ ఘటనపై టీడీపీ సీనియర్ నేత అచ్చెన్నాయుడు తీవ్రంగా స్పందించారు. తమ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయ స్వామి, గోరంట్ల బుచ్చయ్య చౌదరిపై వైసీపీ సభ్యులు దాడి చేశారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. జీవో 1 ని రద్దు చేయాలంటూ తాము వాయిదా తీర్మానం ఇచ్చామని, దానికి స్పీకర్ అంగీకరించలేదని పేర్కొన్నారు. దీనికి ప్రతిగా తాము పోడియం దగ్గరికి వెళ్లి, నిరసన వ్యక్తం చేశామన్నారు. తాము తప్పు చేస్తే స్పీకర్ చర్యలు తీసుకుని, సస్పెండ్ చేయాలన్నారు. కానీ… వైసీపీ ఎమ్మెల్యేలు గూండాల మాదిరిగా వచ్చారని మండిపడ్డారు. ఇంత దారుణంగా సభలోనే వైసీపీ ప్రత్యక్ష దాడికి దిగిందని విరుచుకుపడ్డారు.