టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు ఇంటి గోడ కూల్చివేత వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిపోయింది. వైసీపీ వర్సెస్ టీడీపీగా నడుస్తోంది. అయ్యన్న ఇంటి గోడను కూల్చివేయడంపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, పార్టీ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇది ముమ్మాటికీ వైసీపీ కక్షసాధింపు చర్యల్లో భాగమని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మండిపడ్డారు.
టీడీపీలో బలమైన బీసీ నేతలే టార్గెట్ గా సీఎం జగన్ అరెస్టులకు, దాడులకు పాల్పడుతున్నారని తీవ్రంగా మండిపడ్డారు. మినీ మహానాడు వేదికగా వైసీపీ వైఫల్యాలను ప్రస్తావించినందుకే అయ్యన్నపై వైసీపీ సర్కార్ ఇలా కక్షసాధింపుకు దిగుతోందన్నారు. అయ్యన్న పాత్రుడికి పార్టీ పూర్తిగా అండగా వుంటుందని బాబు ప్రకటించారు. అయ్యన్న పాత్రుడు అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్క ప్రశ్నకు కూడా వైసీపీ సమాధానమిచ్చే స్థాయిలో లేదని, అందుకే ఇలా దాడులకు దిగుతోందని చంద్రబాబు విమర్శించారు.
ఇది కక్షసాధింపు చర్యే : యనమల
బీసీలను అణచివేయడమే ధ్యేయంగా సీఎం జగన్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు అన్నారు. మినీ మహానాడు వేదికగా వైఫల్యాలను ప్రశ్నించినందుకే అయ్యన్న ఇంటి గోడ కూల్చడం సిగ్గుచేటని ఎద్దేవా చేశారు.
టీడీపీకి వస్తున్న ఆదరణ ఓర్వలేకే… పట్టాభి
రోజు రోజుకీ వైసీపీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వస్తోందని టీడీపీ సీనియర్ నేత పట్టాభి అన్నారు. అయితే.. అదే సమయంలో టీడీపీపై ప్రజల్లో అభిమానం కూడా పెరుగుతోందని, దీనిని చూసి ఓర్వలేకే ఇలా చేస్తున్నారని అన్నారు. అయ్యన్న పాత్రుడి కుటుంబం మచ్చలేని కుటుంబం అని, ఆయనపై ఎన్ని కేసులు పెట్టినా, భయం లేకుండా జగన్ పై పోరాటం చేస్తూనే వుంటారని పట్టాభి అన్నారు. పోలీస్ వ్యవస్థ పక్షపాతంగా వుండటం బాధాకరమని అన్నారు.