టీడీపీ నేత అయ్యన్న పాత్రుడి ప్రహారీ గోడ కూల్చి వేతల వ్యవహారం ఏపీలో ఇప్పుడు హాట్ టాపిక్. వైసీపీ వర్సెస్ టీడీపీగా నడుస్తోంది. అయితే అయ్యన్న పాత్రుడికి హైకోర్టులో ఊరట దొరికింది. దీనిపే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. రాత్రిపూట కూల్చివేతలపై హైకోర్టు వ్యాఖ్యలకు సీఎం జగన్ ఏం సమాధానం చెబుతారని సూటిగా ప్రశ్నించారు. తప్పు చేసిన అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఇడుపులపాయ భూముల విషయాన్ని ప్రస్తావించారు. అయ్యన్న పాత్రుడిది కబ్జా కాదని, ఇడుపుల పాయలో వైఎస్ కుటుంబం చేసింది కబ్జా అంటూ కౌంటర్ ఇచ్చారు.
ఇడుపుల పాయలో వైఎస్సార్ కుటుంబం 600 ఎకరాల దళిత భూములను లాక్కోవడం నిజమైన కబ్జా అంటూ చంద్రబాబు ధ్వజమెత్తారు. టీడీపీ బీసీ నేతలపై, టీడీపీ నేతలపై రోజూ ఏదో ఒకరకంగా దాడులు చేస్తూ జగన్ వేధించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రతిసారీ కోర్టు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని, ప్రతి అధికారి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వుంటుందన్నారు. ప్రభుత్వం ప్రాపకాల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ అధికారులు చిక్కుల్లో పడొద్దని చంద్రబాబు హితవు పలికారు.