ఏపీలోని వరద కష్టాలపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. వరద కష్టాల్లో వున్న ప్రజలకు ప్రభుత్వం ఉందన్న నమ్మకాన్ని కలిగించాలని అన్నారు. భారీ వర్షాల కారణంగా.. గోదావరిలోకి వరదొచ్చిందని, 525 గ్రామాల జీవనం అస్తవ్యస్తమైపోయిందన్నారు. పోలవరం ముంపు గ్రామాలతో పాటు లంక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం, నిద్రిస్తోందని చంద్రబాబు మండిపడ్డారు. ప్రజలను తగిన సమయంలో అప్రమత్తం చేయడం వల్ల ప్రాణ, ఆస్తి నష్టాలు తగ్గుతాయని సూచించారు.
తమ పాలనలో భారీ వర్షాల సమయంలో ఓ సాంకేతిక వ్యవస్థను ఏర్పాటు చేసి, ఆ టెక్నాలజీతో ప్రజలను అప్రమత్తం చేసేవారిమని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ.. జగన్ పాలనలో పరిస్థితి పూర్తి భిన్నంగా వుందని మండిపడ్డారు. ప్రభుత్వం ప్రతిపక్షాలపై ఆరోపణలు చేయకుండా.. ప్రజలను ఆదుకోవాలని, యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని చంద్రబాబు కోరారు. రాష్ట్రంలో ప్రభుత్వం వుందన్న నమ్మకాన్ని ప్రజలకు కలిగించాలని చంద్రబాబు ట్విట్టర్ వేదికగా సూచించారు.