టీడీపీ అధికారంలోకి వస్తే.. పోలవరం ముంపు మండలాలతో కొత్త జిల్లాను ఏర్పాటు చేస్తామని టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు వల్ల నష్టపోయే వారికి న్యాయం చేయాలన్నదే తన ఆకాంక్ష అని వివరించారు. ఏలూరు జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటించారు. పోలవరం బాధితులకు వెయ్యి కోట్లు, 2 వేల కోట్లయితే ఇస్తారు కానీ… 20 వేల కోట్లయితే తన వల్ల కాదని చెప్పడం బాధ్యతా రాహిత్యమంటూ ఫైర్ అయ్యారు. తాను పోలవరం కట్టలేనని సీఎం జగన్ చేతులెత్తేశారని, ఇదేం పద్ధతి అంటూ విమర్శించారు. ఓట్ల కోసం జగన్ అప్పట్లో పాదయాత్ర చేశారని, ప్రజలు కష్టాల్లో వుంటే గాల్లో తిరిగారని ఎద్దేవా చేశారు.
41 కాంటూరు పరిధిలో మాత్రమే కాదని, కాంటూరు పరిధిలో వుండే వారందరికీ ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. బురదలో వుండే వారి కష్టాలు తాడేపల్లి ప్యాలెస్ లో వుండే వారికి ఏమాత్రం తెలియదని చంద్రబాబు చురకలంటించారు. ప్రజల మధ్య వుండి.. వారి కష్టాలు తెలుసుకోవడం మానవత్వం వున్న ప్రభుత్వ లక్షణమని, కానీ.. ఈ ప్రభుత్వంలో అలా లేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తే రాష్ట్రం బాగుటుందని భావించే, ముంపు ప్రాంతాల ప్రజలు సర్వం త్యాగం చేశారని, పరిహారం, పునరావాసం విషయంలో సీఎం జగన్ కొత్త కుట్రకు తెరలేపారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా తిరక్కపోతే.. ప్రజలు తిరగబడతారన్న భయంతోనే సీఎం జగన్ వరద ప్రాంతాల్లో పర్యటించారని చంద్రబాబు అన్నారు.