ఏపీలో జరుగుతున్న వైసీపీ ప్లీనరీపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తీవ్రంగా విమర్శలు చేశారు. వైసీపీ అద్దె మనుషులతో ప్లీనరీ నిర్వహించిందని, దీని ద్వారా ఏం సాధించారని చంద్రబాబు ప్రశ్నించారు. తాము రెండేళ్లకో సారి ప్లీనరీ నిర్వహించుకుంటామని, ప్రజాస్వామ్య యుతంగా అధ్యక్షులను ఎన్నుకుంటామని వివరించారు. చిత్తూరు జిల్లా నగరిలో జరిగిన రోడ్ షోలో చంద్రబాబు ప్రసంగించారు. వైసీపీ శాశ్వత అధ్యక్షుడిగా జగన్ వుంటారని, అందుకు తీర్మానం కూడా అయ్యిందని, ఇలా ఎక్కడైనా వుంటుందా? అంటూ ప్రశ్నించారు.
ఇక వైసీపీలో ఎన్నికలు వుండవట.. ఇలాంటి ఆలోచనలు ఎక్కడైనా వుంటాయా? అంటూ విమర్శించారు. వైసీపీ ఓ పార్టీయా? ఇదెక్కడి ప్రజాస్వామ్యం అంటూ చంద్రబాబు దుమ్మెత్తిపోశారు. జగన్ అందరినీ వాడుకున్నారని, ఆ తర్వాత చెల్లిని పార్టీ నుంచి పంపించేశారని, ఇప్పుడు తల్లి విజయమ్మ వంతు వచ్చిందని, ఆమెను కూడా పంపించేశారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.
ఇకపై చీకటి పాలన వద్దు.. చీకటి జీవోలు వద్దన్నారని, ఎంత మందికి అమ్మఒడి, ఆసరా పెన్షన్లు ఇచ్చారో ధైర్యంగా ప్రకటించాలని చంద్రబాబు వైసీపీకి సవాల్ విసిరారు. ఈ వివరాలను వెబ్ సైట్ లో పెట్టే దమ్ముందా? అని ప్రశ్నించారు. జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి కానీ.. గడప కూడా దాటడం లేదన్నారు. జగన్ కు కేసులు కొత్త కాదని, ఇప్పుడు తమపై పెగాసెస్ కేసులు పెడతామని అంటున్నారని, పెగాసెస్ అంటే ఏమిటో జగన్ కి తెలుసా? అంటూ ఎద్దేవా చేశారు. ఐటీ గురించి తనకు చెబుతారా? అంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు.