నంద్యాలలో బహిరంగ చర్చ అనేది ఇప్పుడు తెగ రాజకీయ కాక రేపుతోంది. టీడీపీ నేత, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తనతో బహిరంగ చర్చకు రావాలని ఎమ్మెల్యే శిల్పా రవికి సవాల్ చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు గాంధీ చౌక్ వద్దకు చర్చకు రావాలని, శిల్పా కుటుంబం చేసిన అవినీతిని చర్చిద్దామని సవాల్ విసిరారు. ఇందుకు ఎమ్మెల్యే శిల్ప రవి కూడా ఓకే చెప్పడంతో వివాదం ముదిరింది. అయితే… యాక్ట్ 30 అమలులో వున్నందున బహిరంగ చర్చకు అనుమతులు లేవని పోలీసులు ప్రకటించారు. అనుమతులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారంటూ భూమా అఖిలప్రియకు నోటీసులిచ్చారు. ఆళ్లగడ్డలో భూమా అఖిలప్రియను పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు.
వైసీపీ ఎమ్మెల్యే శిల్ప రవి కుటుంబం టీడీపీ వైపు చూస్తోందని భూమా అఖిలప్రియ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో అటు టీడీపీలో, ఇటు వైసీపీలో చిచ్చు ప్రారంభమైంది. రాజకీయంగా శిల్పా కుటుంబాన్ని ఇరికించడానికే అఖిలప్రియ ఇలా మాట్లాడారా? లేదంటే.. నిజంగానే చూస్తున్నారా? అని మాట్లాడుకుంటున్నారు. అయితే… ఎమ్మెల్యే శిల్పా రవి చేసిన అవినీతిపై బహిరంగ చర్చకు సిద్ధమని భూమా ప్రకటించారు. ఆమె ఇంటి నుంచి బయటకు రాకుండా 30 మందికి పైగా పోలీసులు పహారా కాస్తున్నారు. నీ ప్రతాపం ఏంటో నాప్రతాపం ఏంటో చూసుకుందాం.. పార్టీకి రాజీనామా చేసి రా.. ప్రజల్లోనే తేల్చుకుందాం అంటూ భూమా అఖిలప్రియ సవాల్ చేశారు.