తెలంగాణ టీడీపీ మరో భారీ కుదుపుకు సిద్ధమవుతోంది. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి టీడీపీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించారు. టీడీపీ తనకు కన్నతల్లి లాంటిదంటూ కంటతడి పెట్టుకున్నారు. అయితే… తెలంగాణలో రాజకీయ సమీకరణాలు చాలా వేగంగా మారిపోతున్నాయని, పార్టీ మార్పు తప్పనిసరై పోయిందంటూ కుండబద్దలు కొట్టారు. అతి త్వరలోనే టీడీపీకి గుడ్ బై చెప్పేస్తానని, ఏ పార్టీలోకి వెళ్లాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
కొత్త కోట దయాకర్ రెడ్డి మాజీ సీఎం చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరు గడించారు. అంతేకాకుండా పార్టీకి విధేయుడిగా కూడా కొనసాగుతూ వస్తున్నారు. తెలంగాణలో టీడీపీ ఖాళీ అయినా సరే… ఆయన ఇంకా పార్టీలోనే కొనసాగుతున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా ఆయన్ను పార్టీ మారమని ఒత్తిడి తేవకపోవడం విశేషం. అయితే… ఈ మధ్య తెలంగాణ రాజకీయాలు బాగా ఫాస్ట్ అయిపోవడంతో పార్టీ మారాలని ఆయనే నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. కొన్ని రోజుల క్రిందట ఆయన బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా భేటీ అయ్యారు. కానీ… ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరేందుకు సుముఖంగా వున్నట్లు సమాచారం.