శ్రీకాకుళం జిల్లా పలాసా పర్యటనకు వెళ్తున్న టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ ను శ్రీకాకుళం వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్ తో సహా టీడీపీ నేతలను ఎచ్చెర్ల జేఆర్ పురం పీఎస్ కు తరలించారు. అంతకు ముందు పోలీసులు నారా లోకేశ్ ను అడ్డుకున్నారు. దీంతో టీడీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశాయి. లోకేశ్ పర్యటనకు అనుమతి లేదని, అందుకే వెళ్లనివ్వడం లేదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో భూదందా సాగుతోందని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ విషయంపై అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఆక్రమణల పేరుతో తమ ఇళ్లను అధికారులు కూల్చేస్తున్నారని టీడీపీ ఆరోపిస్తోంది. ఈ నేపథ్యంలోనే లోకేశ్ శ్రీకాకుళంలో పర్యటిస్తున్నారు.
మరోవైపు టీడీపీ నేత, నియోజకవర్గ ఇన్ ఛార్జీ గౌతు శిరీష మంత్రి సీదిరి అప్పల రాజుపై వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఆమె క్షమాపణలు చెప్పకపోతే… టీడీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని వైసీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. 18 వ తేదీ దాటినా… గౌతు శిరీష మంత్రికి క్షమాపణలు చెప్పకపోవడంతో శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి జూనియర్ కలాశాల వరకు వైసీపీ నిరసన చేపట్టింది. టీడీపీ కార్యాలయాన్ని ముట్లడించేందుకు రెడీ అయ్యింది. తాము పార్టీ కార్యాలయంలోనే వుంటామని, వైసీపీ ఎలా ముట్టడిస్తుందో చూస్తామని టీడీపీ నేత గౌతు శిరీష సవాల్ విసిరింది. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస – కాశీబుగ్గ జంట పట్టణాల్లో ఆంక్షలు విధిస్తూ శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జీఆర్ రాధిక ఆదేశాలు జారీ చేశారు. 144 సెక్షన్ విధించారు. ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలు మోహరించాయి. ఆదివారం సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని ఎస్పీ హెచ్చరించారు.