ముసులుగులు ధరించిన ముగ్గురు వ్యక్తులు తనను కొట్టారని టీడీపీ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభి న్యాయవాది ముందు పేర్కొన్నారు. తన ముఖానికి టవల్ చుట్టేసి, అరగంట పాటు తీవ్రంగా కొట్టారని, దీంతో అరచేతిపైనా, కాళ్లపైనా వాచిపోయిందన్నారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు కూడా గురిచేశారన్నారు. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు విధ్వంసానికి దిగారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న పట్టాభిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనపై హత్యాయత్నంతో పాటు ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ కేసులు కూడా పెట్టారు. మరోవైపు పట్టాభిని పోలీసులు మంగళవారం సాయంత్రం గన్నవరం అదనపు మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచారు.
గన్నవరం సీఐ కనకారావు, పట్టాభి సహా 11 మంది టీడీపీ నేతలు హత్య చేసేందుకు ప్రయత్నించారని, కులం పేరుతో దూషించారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని న్యాయమూర్తిని కోరారు. అయితే.. పోలీసులు తనను కొట్టారని పట్టాభి న్యాయమూర్తికి ఫిర్యాదు చేయడంతో… పట్టాభికి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించాలని సూచించారు. మరోవైపు పట్టాభితో సహా ఇతర టీడీపీ నేతలకు మార్చి 7 వ తేదీ వరకూ రిమాండ్ విధించారు.
పోలీసులు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, శారీరకంగా హింసించారని టీడీపీ నేత పట్టాభి మేజిస్ట్రేట్ కి ఫిర్యాదు చేశారు. దీంతో పట్టాభి వాంగ్మూలాన్ని న్యాయమూర్తి రికార్డు చేశారు. బస్సులో వెళ్తున్న సమయంలో పోలీసులు తనను కొట్టారని చేతులు చూపించిన పట్టాభి. చేతులు వాచినట్లు సైగలు చేస్తూ పట్టాభి కోర్టులోకి వెళ్లాడు. అక్కడ విచారణ కొనసాగుతోంది. అంతకుముందు పట్టాభి సహా టీడీపీ నేతలకు పోలీస్ స్టేషన్‌లోనే వైద్య పరీక్షలు నిర్వహించారు.