యువగళం పేరుతో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన పాదయాత్ర 500 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మదనపల్లి సీటీఎం దగ్గర నారా లోకేశ్ దీనికి సంబంధించిన శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ప్రస్తుతం నారా లోకేశ్ పాదయాత్ర మదనపల్లి నియోజకవర్గంలో కొనసాగుతోంది. రాష్ట్రంలోని యువతకు భరోసా ఇచ్చే వేదిక యువగళం అని.. టీడీపీ యువనేత నారా లోకేశ్ స్పష్టం చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. 125కు పైగా నియోజకవర్గాల్లో లోకేశ్ పాదయాత్ర సాగనుంది. కుప్పం నియోజకవర్గం పరిధిలోని లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయం నుంచి లోకేశ్ పాదయాత్ర ప్రారంభంఅక్కడ ప్రత్యేక పూజలు చేసి.. ముహూర్తానికి లోకేశ్ తొలి అడుగు వేశారు.
కుప్పం నుంచి ప్రారంభం కానున్న పాదయాత్ర.. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు సాగనుంది. ప్రతి నియోజకవర్గంలో 3 రోజుల పాటు లోకేశ్ పాదయాత్ర ఉండేలా ప్లాన్ చేశారు. ఒక్కో నియోజకవర్గంలో ఒక బహిరంగ సభ పెట్టనున్నారు. ఏడాదికి పైగా సాగే ఈ పాదయాత్రలో వీలైనన్ని ఎక్కువ గ్రామాలను చుట్టేసేలా ప్లాన్ చేశారు. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలు ప్రధాన అజెండాగా సాగే పాదయాత్రలో.. మహిళలు, రైతులు, వివిధ వర్గాల వారి సమస్యలను చర్చించి ప్రజల్లో చైతన్యం తీసుకురానున్నారు. యువత ప్రభుత్వానికి వ్యతిరేకంగా యువగళం వినిపించాలని లోకేశ్ నిర్ణయించారు. 96862 96862 నంబర్‌కి మిస్డ్ కాల్ ఇచ్చి యువగళంలో పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు.