సామాజిక ఉద్యమకారిణి తీస్తా సెతల్వాడ్ ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బృందం (ఏటీఎస్) అరెస్ట్ చేసింది. ముంబైలోని ఆమె నివాసం దగ్గరే పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి ఆమెను అహ్మదాబాద్ కు తరలించారు. గుజరాత్ అల్లర్లకు సంబంధించి.. ప్రత్యేక దర్యాప్తు బృందానికి తీస్తా సెతల్వాడ్ తప్పుడు సమాచారం ఇచ్చారన్నది ఆమెపై వచ్చిన అభియోగం. అయితే ఎలాంటి సమాచారం లేకుండానే ఆమెను అరెస్ట్ చేశారని తీస్తా సెతల్వాడ్ తరపు న్యాయవాది ఆరోపించారు.
ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి, ఆమెపై దాడికి పాల్పడ్డారని మండిపడ్డారు. అయితే.. ఈ ఆరోపణలను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు ఖండించారు. అహ్మదాబాద్ కు తరలించిన తర్వాత అధికారికంగా అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఇక ఇదే విషయంలో గుజరాత్ మాజీ డీజీపీ శ్రీకుమార్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
2002 గుజరాత్ అల్లర్ల కేసులో ప్రధాని మోదీకి సిట్ క్లీన్ చిట్ ఇవ్వడాన్ని సుప్రీం సమర్థించడం, ఈ కేసులో కో పిటిషనర్ గా ఉన్న తీస్తా సెతల్వాడ్ వైఖరిని తప్పుపట్టడం తెలిసిందే. ప్రభుత్వంపై అసంతృప్తితో వున్న కొందరు ఉన్నతాధికారులు ఇతరులతో కుమ్మక్కై కేసును సంచలనం చేయాలని చూశారని, వారంతా సిట్ కు తప్పుడు సమచారం ఇచ్చారని కూడా సుప్రీం పేర్కొంది. అలాంటి వారిని జైళ్లో పెట్టాలని కూడా సుప్రీం పేర్కొంది.