Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు… సోమవారానికి వాయిదా

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ శాసనసభ్యులకు సభ సంతాపం ప్రకటించింది. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ..సూర్యాపేటలోని తుంగతుర్తి నియోజకవర్గ మాజీ సభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల సభ తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తుందని అన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని స్పీకర్ పోచారం ప్రకటించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం 1978-1983, 1983-84 వరకు తుంగతుర్తి ఎమ్మెల్యేగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారని,1945 నుంచి 48 వరకు జరిగిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. సాయుధ పోరాటంలో మొట్టమొదట తుపాకీ పట్టిన మహిళ మల్లు స్వరాజ్యమని, 1981 -2002 వరకు ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘంలో చురుగ్గా పాల్గొని, సంఘానికి అధ్యక్షురాలుగా పనిచేశారని అన్నారు. 1993లో అప్పటి ఏపీలో జరిగిన సంపూర్ణ మద్యపాన నిషేధ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని, ఆమె నియోజకవర్గ ఎనలేని కృషిచేశారని కొనియాడారు. 2022 మార్చి 19న 90 సంవత్సరాల వయసులో మరణించారు అని స్పీకర్ అన్నారు.

 

ఇక… కరీంనగర్‌ జిల్లాలోని కమలాపూర్‌ నియోజకవర్గం మాజీ సభ్యుడు పరిపాటి జనార్దన్‌రెడ్డి మృతి పట్ల కూడా సభ తీవ్ర సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు స్పీకర్ ప్రకటించారు. జనార్దన్‌రెడ్డి 1972-78, 1978-1983 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభకు ప్రాతినిథ్యం వహించారు. 1959-71 వరకు హుజూరాబాద్‌ సమితి అధ్యక్షుడిగా పని చేశారు. జమ్మికుంటలో కృషి విజ్ఞాన కేంద్రం ఏర్పాటు చేసి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడ్డారు.

 

లెప్రా సొసైటీలో సభ్యుడైన ఆయన.. 1968 హిందూ కుష్ఠు నివారణ సమితిని స్థాపించి.. వ్యాధిగ్రస్తులకు పునరావాస కేంద్రం ఏర్పాటు చేశారు. 1974 సంవత్సరంలో గ్రామ నవ నిర్మాణ సమితి అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించి వ్యవసాయం, ఆరోగ్యం, విద్య, గ్రామీణాభివృద్ధి రంగంలో ప్రజలకు సేవలందించారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొని, జైలు శిక్ష అనుభవించారు. సోషలిస్ట్‌ నేతగా గొప్ప పేరు సంపాదించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎనలేని కృషి చేశారు. 2022, మార్చి 28న 87 సంవత్సరాల వయసులోమరణించారు. రెండు నిమిషాల పాటు సభ వీరికి సంతాపం ప్రకటించింది. అనంతరం సోమవారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ వాయిదా పడింది. ఆ తర్వాత బీఏసీ సమావేశం జరగనుంది. సభ ఎన్ని రోజులు జరపాలి? ఏయే అంశాలపై చర్చించాలని ఇందులో చర్చించనున్నారు.

Related Posts

Latest News Updates