TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద మా నౌకరీలు మాగ్గావాలి అన్న పేరుతో తెలంగాణ బీజేపీ నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. దీనిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు ఇతర నేతలు కూడా పాల్గొన్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకూ కొనసాగుతుంది. ప్రశ్నాపత్రం లీకేజీకి బాధ్యత వహించి, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.
తాను ఇంట్లో లేని సమయంలో తన ఇంటికి వచ్చి, నోటీసులు అంటించిపోయారని ఎద్దేవా చేశారు. ఈ వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్ తోనే మహాధర్నా చేపట్టామని ప్రకటించారు. నిరుద్యోగ మహాధర్నా బీజేపీకే పరిమితమైన కార్యక్రమం కాదని, 30 లక్షల మంది నిరుద్యోగులు, వారి కుటుంబాల భవిష్యత్తుకు ముడిపడి ఉన్న సమస్య అని పేర్కొన్నారు. అసలు భయమంటే ఏమిటో ప్రభుత్వానికి చూపిస్తామని ప్రకటించారు.
ప్రశ్నాపత్రం లీకేజీతో 30 లక్షల మంది యువకుల భవిష్యత్ అంధకారంలోకి వెళ్లిందన్నారు. అసలు నిందితులను అరెస్ట్ చేయకుండా, వారిని తప్పించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇదే విషయంపై తాము గన్ పార్క్ వద్ద, అన్ని జిల్లాల్లోనూ ఆందోళన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. నిరుద్యోగులకు అండగా బీజేపీ వుంటుందని, ఎలాంటి అఘాయిత్యాలు చేయవద్దని పిలుపునిచ్చారు.
వచ్చేది రామ రాజ్యమని, బీజేపీ ప్రభుత్వమని కచ్చితంగా జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. లీకేజీ వ్యవహారంలో ప్రభుత్వాన్ని విడిచిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. లీకేజీకి మంత్రి కేటీఆర్ బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని ,అసలైన దోషులను గుర్తించి, శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. అనేక మంది యువకులు కష్టపడి, కోచింగులు తీసుకున్నారని, వారందరి జీవితాలను అంధకారంలోకి నెట్టారని మండిపడ్డారు. వారందరికీ లక్ష రూపాయలు భ్రుతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.