ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ తెలంగాణ నేతల భేటీ ముగిసింది. దాదాపు 2 గంటల పాటు ఈ కీలక భేటీ జరిగింది. తెలంగాణలో భవిష్యత్ కార్యాచరణ, పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలపై వీరు చర్చించారు. ఈ సమావేశం తర్వాత బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ప్రజా గోస కార్యక్రమాలు, కార్నర్ మీటింగ్స్ పెట్టామని, వీటిపై అధిష్ఠానం సంతోషం వ్యక్తం చేసిందని వెల్లడించారు.
వచ్చే ఎన్నికల్లో 119 నియోజకవర్గాల్లోనూ బీజేపీ పోటీ చేస్తుందన్నారు. ఈ మేరకు 119 నియోజకవర్గాల్లో బహిరంగసభలు పెట్టాలని నిర్ణయించుకున్నామని ఆయన వెల్లడించారు. 10 జిల్లాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించి, ఏదో ఒక సభకు ప్రధాని మోదీని ఆహ్వానిస్తామని ప్రకటించారు. అయితే… అమిత్ షా, జేపీ నడ్డాతో జరిగిన ఈ సమావేశం చాలా రొటీన్ సమావేశమని, 15 రోజుల క్రిందటే ఇది షెడ్యూల్ అయ్యిందన్నారు. బీఆర్ఎస్ కి బీజేపీయే ప్రత్యామ్నాయమని, దుబ్బాక, హుజూరాబాద్ ఫలితాలే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. 119 నియోజకవర్గాల్లో బీజేపీకి బలమైన నేతలున్నారని, తమకు అభ్యర్థులు లేరన్నది బీఆర్ఎస్ ప్రచారమేనని విమర్శించారు. కేవలం 2 సీట్లతో ప్రారంభమైన బీజేపీ ప్రస్థానం నేడు 300 సీట్లు దాటిందని గుర్తు చేశారు.
లిక్కర్ కేసులో మనీష్ సిసోడియాను అరెస్టు చేస్తే బీజేపీకి ఏంటి సంబంధం అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రశ్నించారు. లిక్కర్ కేసులో తాము ఎలాంటి చర్చ జరుపలేదన్నారు. మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్టు చేస్తే కేసీఆర్ స్పందించాడు కాని.. కవితకు సీబీఐ నోటీసులిస్తే కేసీఆర్ ఎందుకు స్పందించలేదని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. సిసోడియా అరెస్టుకు, బీజేపీకి ఎలాంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు. తెలంగాణ బీజేపీలో నేతలందరమూ కలిసే వున్నామని బండి సంజయ్ ప్రకటించారు.