తెలంగాణ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన శాసనసభా వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశమైంది. 6 న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలని నిర్ణయించారు. 8 న బడ్జెట్, పద్దులపై చర్చించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై శనివారం అసెంబ్లీలో చర్చ చేపట్టనున్నారు. ఈ నెల 5, 7 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. 8న మరోసారి భేటీయై అసెంబ్లీ సమావేశాల కొనసాగింపుపై నిర్ణయం తీసుకోవాలని సభ్యులు నిర్ణయించారు. 25 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరింది.
రెండేళ్ల తర్వాత గవర్నర్ తమిళిసై తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. గతేడాది సాంకేతిక కారణాలతో గవర్నర్ ప్రసంగం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు జరిగాయి. ఈ ఏడాది కూడా గవర్నర్ స్పీచ్ లేకుండానే సమావేశాలు నిర్వహించాలనుకున్నా చివరకు ప్రభుత్వం వెనక్కి తగ్గింది. చివరికి బడ్జెట్ సమావేశాల సందర్భంగా ప్రసంగించాలని మంత్రి ప్రశాంత్ రెడ్డి రాజ్ భవన్ కి వెళ్లి, గవర్నర్ ని ఆహ్వానించారు. ఇందుకు గవర్నర్ అంగీకరించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీకి వచ్చిన గవర్నర్ తమిళిసైకు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్వాగతం పలికారు.
తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న సమ్మిళిత సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయే విధంగా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నదని చెప్పారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పరిపాలనా దక్షత వల్ల తెలంగాణ అపూర్వ విజయాలు సాధించిందన్నారు.
రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పిందని.. మరో 13 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 30 శాతం మాత్రమే ఉండేదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో చేపట్టిన సమర్థవంతమైన చర్యల వల్ల నేడు ప్రసవాల రేటు 61 శాతానికి పెరిగిందని చెప్పారు.