కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేయడాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. ప్రధాని మోదీ(పాలన ఎమర్జెన్సీని మించిపోతుందని కేసీఆర్ మండిపడ్డారు. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొని తెచ్చుకుంటున్నారని కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.
”భారతదేశ ప్రజాస్వామ్య చరిత్రలో నేడు చీకటిరోజు. రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వంపై అనర్హత వేటు వేయడం నరేంద్రమోదీ దురంహంకారానికి, నియంతృత్వానికి పరాకాష్ట. రాజ్యాంగబద్ద సంస్థలను దురుపయోగం చేయడమే కాకుండా అత్యున్నత ప్రజాస్వామ్య వేదిక అయిన పార్లమెంటును సైతం తమ హేయమైన చర్యలకోసం మోదీ ప్రభుత్వం వినియోగించుకోవడం గర్హనీయం. ప్రజాస్వామ్యానికి రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జన్సీని మించిపోతున్నది. ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్థులు, దగాకోరుల కొసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు. పార్టీల మధ్య వుండే వైరుధ్యాలకు ఇది సందర్భం కాదు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం కోసం బీజేపీ ప్రభుత్వ దుశ్చర్యను ప్రజాస్వామ్యవాదులందరూ ముక్త కంఠంతో ఖండించాలి. బీజేపీ దుర్మార్గ విధానాలను ప్రతిఘటించాలి” అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
"ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ విలువలకు చేటుకాలం దాపురించింది. మోదీ పాలన ఎమర్జెన్సీని మించిపోతున్నది.
ప్రతిపక్ష నాయకులను వేధించడం పరిపాటిగా మారిపోయింది. నేరస్తులు, దగాకోరుల కోసం ప్రతిపక్ష నాయకులపై అనర్హత వేటు వేసి మోదీ పతనాన్ని కొనితెచ్చుకుంటున్నారు.": సీఎం శ్రీ కేసీఆర్
— Telangana CMO (@TelanganaCMO) March 24, 2023
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై అనర్హత వేటు పడింది. ఈ మేరకు లోక్ సభ సెక్రెటేరియట్ ఉత్తర్వులు జారీ చేసింది. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్ 8(3) ప్రకారం ఆయనపై అనర్హత పడింది. సూరత్ కోర్ట్ తీర్పు ప్రకారం లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనపై వెంటనే చర్యలకు ఉపక్రమించింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాహుల్ గాంధీ 2 స్థానాల నుంచి బరిలోకి దిగారు. ఎప్పటి లాగే అమేథీ నుంచి బరిలో వున్నా… రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో కేరళలోని వయనాడ్ నుంచి కూడా బరిలో నిలిచారు.అయితే అమేధీ నుంచి బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ గెలుపొందగా… రాహుల్ ఓడిపోయారు. అయితే… రెండో స్థానమైన వయనాడ్ నుంచి గెలుపొందారు.