తెలంగాణ రాష్ట్రం దేశానికే రోల్ మోడల్ గా మారిందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. ప్రజల ఆశీర్వాదం, సీఎం సమర్థ పాలనతో రాష్ట్రం ఎనిమిదిన్నరేళ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని చెప్పారు. సెంబ్లీ 2023-24 వార్షిక బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని అన్ని దవాఖానాల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించిందని చెప్పారు. ఇప్పటి వరకు 20 జిల్లాల్లో డయాగ్నస్టిక్ సెంటర్లను నెలకొల్పిందని.. మరో 13 జిల్లాల్లో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా రాష్ట్రవ్యాప్తంగా 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల రేటు 30 శాతం మాత్రమే ఉండేదని గవర్నర్ తమిళిసై అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య రంగంలో చేపట్టిన సమర్థవంతమైన చర్యల వల్ల నేడు ప్రసవాల రేటు 61 శాతానికి పెరిగిందని చెప్పారు. అదేవిధంగా మాతృ మరణాలు ప్రతి లక్ష ప్రసవాలకు 92 గా ఉండేవని.. 2022 నాటికి 43కు తగ్గిపోయాయన్నారు. 2014లో శిశు మరణాల రేటు ప్రతి వెయ్యి మందికి 39గా ఉండేవని.. 2022 నాటికి ఆ సంఖ్య 21కి తగ్గిందని గవర్నర్ వివరించారు.
వ్యవసాయ రంగంలో చరిత్ర సృష్టించిన తెలంగాణ దేశానికే ధాన్యాగారంగా మారుతోందని గవర్నర్ అభిప్రాయప్డడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల ద్వారా వ్యవసాయం దండగ కాదు పండుగ అని నిరూపించామని అన్నారు. ఉచిత, నాణ్యమైన విద్యుత్ ద్వారా రైతులకు ఎంతో లాభం చేకూరుతోందని, మిషన్ కాకతీయ పథకం వల్ల చెరువులకు పునర్వైభవం వచ్చిందని అన్నారు.
రాష్ట్రం ఏర్పాటుకు ముందు తెలంగాణ ప్రాంతంలో మూడంటే మూడు వైద్య కళాశాలలు మాత్రమే ఉండేవని ఈ సందర్భంగా గవర్నర్ గుర్తు చేశారు. ప్రతి జిల్లాకు ఒక వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా 12 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఇప్పుడు 16 జిల్లాల్లో మొత్తం 17 వైద్య కళాశాలలు పనిచేస్తున్నాయన్నారు. వీటి ద్వారా ప్రభుత్వం రోగులకు మెరుగైన చికిత్స అందించడంతో పాటుగా విద్యార్థులకు వైద్యవిద్యను సమకూరుస్తోందన్నారు.