తెలంగాణ ప్రభుత్వానికి, గవర్నర్ కి మళ్లీ పంచాయతీ ముదిరింది. కొన్ని రోజుల పాటు సజావుగానే సాగినా… మళ్లీ వివాదం రేగింది. 10 బిల్లులను గవర్నర్ తమిళిసై ఆపేశారంటూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టు మెట్లెక్కింది. ఇదే విషయంపై సుప్రీంలో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. గవర్నర్ వద్ద పెండింగ్ లో వున్న బిల్లులను ఆమోదించేలా ఆదేశించాలంటూ చీఫ్ సెక్రెటరీ పిటిషన్ లో కోరారు. సెప్టెంబర్ నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు రాజ్ భవన్ లో పెండింగ్ లో వున్నాయని ప్రభుత్వం పేర్కొంది. ఈ కేసులో ప్రతి వాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖను చేర్చింది సర్కార్.
పెండింగ్‌లో ఉన్న బిల్లులు ఇవే..
1. పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు
2. మున్సిపల్ చట్ట సవరణ బిల్లు
3. మోటార్ వెహికల్ టాక్సేషన్ సవరణ బిల్లు
4. వ్యవసాయ విశ్వవిద్యాలయ సవరణ బిల్లు
5. తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు
6. ములుగులో అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ వర్సిటీ అప్‌గ్రేడ్ బిల్లు
7. అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ బిల్లు
8. పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లు
9. జీఎస్టీ చట్ట సవరణ బిల్లు
10. ప్రయివేటు విశ్వవిద్యాలయాల చట్ట సవరణ బిల్లు
కొన్ని రోజుల క్రిందటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ ఇదే విషయంలో గవర్నర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో తమ ముందు విచారణకు హాజరవ్వాలని జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. దీంతో పాడి కౌశిక్ రెడ్డి ఫిబ్రవరి 21 న విచారణకు హాజరయ్యారు. లంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి జాతీయ మహిళా కమిషన్ ఎదుట హాజరై క్షమాపణలు చెప్పారు. ఈ వ్యవహారంలో నోటీసులు అందుకున్న కౌశిక్ రెడ్డి.. మంగళవారం ఢిల్లీలోని జాతీయ కమిషన్ ముందు హాజరయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసైకి లిఖిత పూర్వక క్షమాపణలు చెబుతానని కౌశిక్ రెడ్డి మహిళా కమిషన్‌కు తెలిపారు.