TSPSC ఏఈ పేపర్ లీక్ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. అభ్యర్థులు, వివిధ రాజకీయ నేతలు, విద్యార్థి సంఘాలు తీవ్రంగా ఆందోళనలు చేస్తున్నాయి. అయితే.. తాజాగా గ్రూప్ 1 ప్రిలిమ్స్ పేపర్ కూడా లీకైనట్లు ఆరోపణలు రావడం మరింత ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపధ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అత్యవసరంగా భేటీ అయింది. సర్వీస్ కమిషన్ చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహిస్తున్నారు.
ఈ నెల 5 న జరిగిన పరీక్ష పేపర్ లీకేజీపైనే ప్రధానంగా చర్చిస్తున్నారు. అయితే… ఏఈ పరీక్షను రద్దు చేసే యోచనలో కమిషన్ వున్నట్లు వార్తలొస్తున్నాయి. అలాగే ప్రధాన నిందితుడు ప్రవీణ్ పరీక్షల సమయంలో వ్యవహరించిన తీరును కూడా సభ్యులు చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. లీకేజీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దీనిపై వివరణ ఇవ్వాలని TSPSC ని కోరింది.
టీఎస్ పీఎస్సీ పరీక్షా పేపర్ లీకేజీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణను కుదిపేస్తోంది. లీకేజీపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు లీకేజీ వ్యవహారంలో పోలీసులు అరెస్ట్ చేసిన 9 మంది నిందితులను నాంపల్లి కోర్టులో న్యాయవాది ఎదుట హాజరుపరిచారు. వాదనలు విన్న న్యాయమూర్తి 9 మంది నిందితులకు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఈ నేపథ్యంలో నిందితులను చంచల్ గూడ జైలుకు తరలించనున్నారు. మరోవైపు కీలక నిందితుడు ప్రవీణ్ ఎగ్జామ్ కూడా రాసేసినట్లు వెలుగులోకి వచ్చింది. అతనికి 103 మార్కులు వచ్చినట్లు పోలీసుల ఫిర్యాదులో వెల్లడైంది.
మరోవైపు కీలక నిందితుడు ప్రవీణ్ కి యువతులతో ఎక్కువ సంబంధాలున్నాయని పోలీసులు తేల్చేశారు. 2017 లో TSPSC లో జూనియర్ అసిస్టెంట్ గా చేరి, 4 సంవత్సరాల పాటు వెరిఫికేషన్ సెక్షన్ లో చేరాడు. ఈ సమయంలోనే మహిళలతో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్నట్లు కూడా పోలీసులు గుర్తించారు. మరోవైపు మహబూబ్ నగర్ జిల్లా దగ్గర్లో ఈ పేపర్ లీకైనట్లు పోలీసులు ఓ నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే… ఆ ప్రాంతంలో ఎవరెవరు పేపర్లు తీసుకున్నారన్న విషయాన్ని బయటికి తెచ్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.