తెలంగాణ బీజేపీ మహా ధర్నాకు తెలంగాణ హైకోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. TSPSC పేపర్ లీకేజీని నిరసిస్తూ ఇందిరా పార్క్ వద్ద మహా ధర్నా నిర్వహించాలని బీజేపీ తలపెట్టింది. అయితే… ఈ ధర్నాకు పోలీసు శాఖ అనుమతి నిరాకరించింది. దీంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. షరతులతో కూడిన అనుమతిని ఇచ్చింది.
అయితే.. ఈ మహా ధర్నాకి కేవలం 500 మంది మాత్రమే హాజరవ్వాలని సూచించింది. అలాగే… ఎలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయకూడదని కూడా పేర్కొంది. ఒకవేళ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే… వారిపై పోలీసులు చర్యలకు ఉపక్రమించవచ్చని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. ఇక… ఈ మహా ధర్నాకి ఎవరెవరు వస్తున్నారన్న జాబితాను పోలీసులకు అందివ్వాలని హైకోర్టు బీజేపీకి సూచించింది.
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సిట్ అధికారులకు లేఖ రాశారు. తనకు సిట్ నోటీసులు అందలేదని అందులో పేర్కొన్నారు. మీడియా ద్వారా తెలిసిన సమాచారం మేరకే తాను స్పందిస్తున్నానని పేర్కొన్నారు. 24 న విచారణకు హాజరు కావాలని మీడియా ద్వారా తెలిసిందన్నారు. అయితే.. పార్లమెంట్ సభ్యుడిగా తాను సమావేశాలకు హాజరు కావాల్సి వుందని పేర్కొన్నారు. అందుకే 24 న విచారణకు రాలేనని పేర్కొన్నారు. అయితే… తన హాజరు తప్పని సరి భావిస్తే.. మరో తేదీ ఇవ్వాలని, అప్పుడు వస్తానంటూ లేఖలో స్పష్టం చేశారు.
అయితే.. పార్లమెంట్ సమావేశాలను పరిగణనలోకి తీసుకునే డేట్ ఫిక్స్ చేయాలని సూచించారు. మరో వైపు తనకు సిట్ పై నమ్మకం లేదని, తన దగ్గరున్న సమాచారాన్ని సిట్ కు ఇవ్వదల్చుకోలేదని బండి సంజయ్ స్పష్టం చేశారు. మొదటి నుంచీ సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనే తాను డిమాండ్ చేస్తున్నానని గుర్తు చేశారు. ”సిట్‌ను నేను విశ్వసించటం లేదు. నా దగ్గరున్న సమాచారాన్ని సిట్‌కు ఇవ్వదలుచుకోవటం లేదు. సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపితే నా దగ్గరున్న సమాచారాన్ని అందిస్తాను. మాకు నమ్మకమున్న సంస్థలకే సమాచారం అందిస్తాం. ” అని బండి సంజయ్ స్పష్టం చేశారు.