కరోనా మూడ్ నుంచి విద్యార్థులను బయటికి తీసుకొచ్చి.. తిరిగి చదువుల్లో మునిగేలా తెలంగాణ సర్కార్ అడుగులు వేస్తోంది. కరోనా కారణంగా గత రెండు సంవత్సరాలుగా విద్యారంగం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంది. ప్రత్యక్ష బోధన కాకుండా.. ఆన్ లైన్ బోధన జరగడం, దీంతో విద్యార్థులకు, విద్యా వ్యవస్థకు మధ్య చాలా గ్యాప్ వచ్చేసింది. చదువులపై సీరియస్ కూడా తగ్గిపోయింది. అంతేకాకుండా కరోనా కారణంగా సిలబస్ కూడా పూర్తి కాలేని పరిస్థితి. దీంతో సగం సిలబస్ కే పరీక్షలు నిర్వహించింది ప్రభుత్వం. దీంతో విద్యార్థులు, అటు తల్లిదండ్రులు కూడా కాస్త రిలీఫ్ అయ్యారు.
ఇప్పుడిప్పుడే ప్రపంచం కోవిడ్ నుంచి కాస్త రిలీఫ్ అవుతోంది. అన్ని రంగాలూ ఇప్పుడిప్పుడే పట్టాలెక్కుతున్నాయి. విద్యా సంస్థలు కూడా వేసవి సెలవులు ముగించుకొని.. పున: ప్రారంభమయ్యాయి. అయితే ఈసారి పూర్తి సిలబస్ అంటే.. 100 శాతం సిలబస్ తో అకాడమిక్ ఇయర్ నిర్వహించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. కరోనా కారణంగా 2021-22 విద్యా సంవత్సరంలో 70 శాతం సిలబస్ తోనే ముందుకు వెళ్లారు.
కరోనా తగ్గడంతో 100 శాతం సిలబస్ తో సాగాలని ఇంటర్ బోర్గు నిర్ణయించినట్లు సమాచారం. ఇక.. కరోనా కారణంగా ప్రశ్నల్లో కూడా 70 శాతం వరకూ ఛాయిస్ ఇచ్చారు. ఈ అకాడమిక్ ఇయర్ లో కూడా దీనినే కొనసాగించాలా? లేదంటే ముందటి లాగే నిర్వహించాలా? అన్న దానిపై త్వరలోనే ఓ నిర్ణయం తీసుకోనున్నారు. ఇక.. ఇంటర్ వొకేషనల్ కోర్సు పూర్తైన విద్యార్థులకు వెంటనే ఉపాధి అవకాశాలు కూడా కల్పించాలని ఇంటర్ అధికారులు నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.