పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా తెలంగాణ రాష్ట్రం ఉందని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఫుడ్ కాంక్లేవ్ – 2023 ప్రారంభోత్సవ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో కలిసి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయని, తెలంగాణ సర్కారు ఆహారశుద్ధి రంగానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నదని రాష్ట్ర పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలన్న సీఎం కేసీఆర్ సంకల్పం మేరకు వ్యవసాయ అనుబంధ రంగాలను విశేషంగా అభివృద్ధి చేస్తున్నామని, ఇందులోభాగంగా ఏకకాలంలో ఐదు విప్లవాలకు నాంది పలికినట్టు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రం దేశంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారిందని ఉద్ఘాటించారు. ప్రస్తుత ఫుడ్ కాంక్లేవ్ ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో ఇలాంటివి ప్రతిఏటా నిర్వహిస్తామని వెల్లడించారు. మత్స్య సంపదలో దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉన్నామని తెలిపారు. కాంక్లేవ్‌లో భాగంగా 21 బృంద చర్చలు ఏర్పాటు చేస్తున్నామని, ఇందులో వందకుపైగా ప్రముఖ కంపెనీల సీఈవోలు, నిపుణులు పాల్గొంటారని చెప్పారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, చేపలు, గొర్రెలు, వంట నూనెల ఉత్పత్తి తదితర ఐదు రంగాలకు సంబంధించి ఇందులో చర్చించనున్నట్టు తెలిపారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా, పౌల్ట్రీ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా ఉందని తెలిపారు. ప్రస్తుతం దేశంలోనే మొట్టమొదటి ఇన్‌లాండ్ ఫిషరీష్ హబ్‌గా ఎదిగిందని పేర్కొన్నారు. గొర్రెలు, మేకల సంఖ్యలో దేశంలో మొదటి రాష్ట్రంగా, డెయిరీ ఇండస్ట్రీలో నాయకత్వ హోదాని సొంతం చేసుకున్నదని తెలిపారు.