తెలంగాణ, ఏపీతో సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛైంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లపై కేంద్రం నిషేధం విధించడంపై తెలంగాణ ప్రభుత్వం స్పందించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పవర్ పర్చేస్ జరపకూడదని కేంద్రం ఆదేశాలివ్వడం సరైన విధానం కాదని తెలంగాణ ట్రాన్స్ కో, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు వ్యాఖ్యానించారు. తాము 1,360 కోట్లు కట్టినా…. నిషేధం విధించడం చాలా బాధాకరమని అన్నారు. ఇలా ఎందుకు జరిగింది అనేది తమకు అర్థం కావడం లేదన్నారు.
అయితే… కేంద్రం నిర్ణయంపై తెలంగాణ సీఎం కేసీఆర్, విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి సమీక్ష జరిపారని ప్రభాకర్ రావు వెల్లడించారు. థర్మల్, హైడల్, సోలార్ పవర్ చాలా బాగా ఉత్పత్తి చేస్తున్నామని, ఎంత డిమాండ్ వచ్చినా… నిరంతరాయంగా సరఫరా చేస్తున్నామని పేర్కొన్నారు. అయితే… కరెంట్ సరఫరాలో అంతరాయం వస్తే ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. హైకోర్టు స్టే ఉన్నా… కేంద్రం ఇలా చేయడం బాధాకరమని ప్రభాకర్ రావు అన్నారు.
13 రాష్ట్రాలు విద్యుత్ బకాయిలు చెల్లించని కారణంగా విద్యుత్ పంపిణీ సంస్థలు ఇంధన ఎక్స్ఛేంజీల నుంచి జరిపే రోజువారీ కరెంటు కొనుగోళ్లను కేంద్రం నిషేధించింది. ఈ జాబితాలో తెలంగాణ, ఏపీతో సహా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్, కర్నాటక, తమిళనాడు, బిహార్, ఛత్తీస్ గఢ్, జార్ఖండ్ రాష్ట్రాలున్నాయి. ఆయా రాష్ట్రాలు బకాయిలు చెల్లించని కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర విద్యుత్ శాఖ చెబుతోంది. 13 రాష్ట్రాల్లోని 27 పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీల పవర్ ట్రేడింగ్ ను నిషేధించాలని ఇండియన్ ఎనర్జీ ఎక్సేజంచీ, పవర్ ఎక్సేంఛ్ ఆఫ్ ఇండియా, హిందూస్తాన్ పవర్ ఎక్స్జేంచీలను కేంద్రం కోరింది.