తెలంగాణ నూతన సచివాలయ ప్రారంభోత్సవం వాయిదా పడింది. ఎమ్మెల్సీ కోడ్ అమలులో వుండటంతో ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అతి త్వరలోనే మరో ప్రారంభోత్సవ తేదీని ప్రకటిస్తామని పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం సీఎం కేసీఆర్ పుట్టిన రోజు ఈ నెల 17 న నూతన సచివాలయాన్ని ప్రారంభించాలని ముహూర్తం ఖరారు చేశారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను కూడా పూర్తి చేశారు.
ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, విపక్ష నేతలను కూడా సీఎం ఆహ్వానించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమం తర్వాత సాయంత్రం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ కూడా నిర్వహించాలని నిర్ణయించారు. ఇంతలో తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. దీంతో ఎలక్షన్ కోడ్ అమలులో ఉండడంతో సచివాలయం ప్రారంభోత్సవాన్ని వాయిదా వేసినట్లు ప్రభుత్వం చెప్పింది.
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు నగారా మోగింది. ఈమేరకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. ఏపీలో 3 పట్టభద్రులు, 2 ఉపాధ్యాయ, 8 స్థానిక సంస్థల స్థానాల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇక.. తెలంగాణలో ఒక ఉపాధ్యాయ, ఒక స్థానిక సంస్థల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ కోటాలో ఎమ్మెల్సీలుగా కొనసాగుతున్న సభ్యుల పదవీ కాలం మార్చి 29 తో ముగిసిపోనుంది. ఏపీలోని ప్రకాశం-నెల్లూరు- చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు, శ్రీకాకుళం- విజయనగరం- విశాఖ పట్టభద్రుల స్థానాల్లో ఎన్నికలు జరగనున్నాయి.
దీంతో పాటు ప్రకాశం-నెల్లూరు-చిత్తూరు, కడప-అనంతపురం-కర్నూలు ఉపాధ్యాయ స్థానాల్లో ఈసీ ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా కడప, నెల్లూరు. తూర్పు, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం, చిత్తూరు, కర్నూలు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాల్లోనూ ఎన్నికలు జరగనున్నాయి. ఇక… తెలంగాణలో హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఉపాధ్యాయ స్థానంతో పాటు హైదాబాద్ స్థానిక సంస్థల స్థానంలో ఎన్నికలు జరగనున్నాయి.