మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. ఈ కేసులో దర్యాప్తు కొనసాగించవచ్చని సీబీఐకి తేల్చి చెప్పింది. అయితే.. విచారణను ఆడియో, వీడియో రూపంలో రికార్డు చేయాలని మాత్రం షరతు విధించింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వైఎస్ అవినాష్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, దానిని కొట్టేసింది. అంతేకాకుండా విచారణ ప్రాంతానికి న్యాయవాదిని కూడా అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. ఎంపీ అవినాష్ రెడ్డి దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లను కూడా హైకోర్టు కొట్టేసింది.సీబీఐ విచారణకు సహకరించాలని అవినాశ్‌రెడ్డికి తేల్చి చెప్పింది.
దీంతో..ఇప్పుడు సీబీఐ మరోసారి అనివాష్ ను విచారణకు పిలిచే అవకాశం కనిపిస్తోంది. అవినాష్ విచారణకు సంబంధించిన వివరాలను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సీబీఐ విచారణ సందర్భంగా అందించింది. 10 డాక్యుమెంట్లు, 35 మంది సాక్షుల వాంగ్మూలాలు, కొన్ని ఫొటోలను కోర్టుకు సమర్పించింది. అవినాష్ విచారణను ఆడియో, వీడియో ద్వారా రికార్డు చేస్తున్నట్లు కోర్టు దృష్టికి సీబీఐ తీసుకొచ్చింది.